- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాష్ట్ర క్యాబినెట్లో ఎవరికి వారే అన్నట్లుగా మంత్రుల వ్యవహారం: మహేశ్వర్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట మంత్రివర్గంలో నాలుగు స్తంభాలాట నడుస్తోందని, మంత్రులంతా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి (BJP leader Maheshwar Reddy) విమర్శించారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ (Cabinet) సమావేశంలో మంత్రుల ప్రవర్తన మారినట్లు మీడియా కథలు వచ్చాయని, గతంలో తాను ఈ విషయం చెప్పినట్లు గుర్తుచేశారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ మంత్రులంతా సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారే తప్ప రాష్ట్ర బాగు కోసం పనిచేయడం లేదని ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనాల పెంపు అంశంపై మంత్రుల మధ్య వాగ్వాదాలు జరిగినట్లు బయటపడిందన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలకు నిధులు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ మాదిరే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నారాయణ్‌పేట-కొడంగల్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనాల పెంపు గురించే ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్లను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సాగునీరు అందించడంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కు, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్కకు మధ్య సమన్వయం లేదని తెలుస్తోందన్నారు.
ఆర్ధిక మంత్రి భట్టి పూర్తిగా కమిషన్ల మంత్రిగా మారిపోయినట్టు లోకం కోడై కూస్తోందని విమర్శించారు. ఆయనను అంతా 15 శాతం కమిషన్ల మంత్రి అంటున్నారన్నారు. బిల్లుల రిలీజ్‌కు సంబంధించి ఒక పద్దతి పాడు లేకుండా పోయిందని, కమిషన్లు ఇవ్వకుంటే ఎళ్ల తరబడిగా పెండింగులో ఉన్న బిల్లులు రిలీజ్ కావడం లేదన్నారు. కమిషన్లు ఇస్తే నెల రోజుల క్రితం పనులు పూర్తయిన వాటి బిల్లులు రిలీజ్ అవుతున్నాయని గుత్తేదార్లు చెబుతున్నారని వెల్లడించారు. ఇక మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ పలు ప్రాజెక్టుల టెండర్లు దక్కుతున్నాయని అనిరుధ్ రెడ్డి వంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారన్నారు. మంత్రి పొంగులేటి హైకమాండు పెద్దలకు కప్పం కడుతూ ఇక్కడ ప్రాజెక్టులను దక్కించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. 15 నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్, మంత్రులు అవినీతి ఊబిలో కూరుకుపోయారని, అందినకాడికి దోచుకోవాలనే విధానంలోనే పనిచేస్తున్నారని, అందుకే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రబలుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నట్లు పేర్కొన్నారు.