Amit Shah: పాక్ జాతీయులను గుర్తించి.. సమాచారం ఇవ్వండి.. అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్ షా

by Shamantha N |
Amit Shah: పాక్ జాతీయులను గుర్తించి.. సమాచారం ఇవ్వండి.. అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. పాకిస్థానీయులు 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో భారత్ సార్క్ వీసా పొడగింపు పథకం కింద చాలా మంది పాకిస్థానీయులకు భారత్ లో పర్యటించే అవకాశాలు కల్పించారు. ఈ ప్రోగ్రామ్‌ కింద భారత్‌లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఇప్పటికీ దేశంలో ఆ వీసా కింద నివసిస్తున్న వారిని గుర్తించి బయటకు పంపేందుకే అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. మానవతా కోణం కింద మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29 వరకు అవకాశం ఇచ్చారు.

వీసా సర్వీసుల నిలిపివేత

ఇక పాక్‌ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ పేర్కొంది. దీంతోపాటు పాక్‌లో ఉన్న భారతీయులు తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. అంతే కాకుండా, గడువు ముగిసేలోగా పాక్‌ జాతీయులు గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. అంతేకాకుండా, పెహల్గామ్ లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పాక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కాగా.. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత, వీసాల సస్పెన్షన్ సహా ఐదు నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు, పెహల్గామ్ దాడి ప్రణాళిక, అమలులో పాకిస్థాన్ ప్రమేయం ఉందని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని భారత్ తెలిపింది. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా దేశాలకు చెందిన సీనియర్ విదేశీ దౌత్యవేత్తలకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ ఆధారాలు చూపించారు.



Next Story