భూ భారతితో సులభతరంగా సమస్యల పరిష్కారం : కలెక్టర్ నారాయణరెడ్డి

by Sumithra |
భూ భారతితో సులభతరంగా సమస్యల పరిష్కారం : కలెక్టర్ నారాయణరెడ్డి
X

దిశ, మాడ్గుల : భూ భారతి చట్టంతో సులభతరంగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం మాడ్గుల మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1976లో తీసుకువచ్చిన ఆర్ఓఆర్ చట్టం 2020 వరకు కొనసాగిందని, 2020 లో ధరణి పేరుతో తీసుకువచ్చిన నూతన ఆర్ఓఆర్ చట్టం లోపభూయిష్టంగా ఉండి, భూ సమస్యలు ఎక్కడికక్కడే పేరుకు పోయాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన భూభారతి చట్టంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ధరణిలో పేరుకుపోయిన సమస్యలకు గ్రామ, మండల, రెవెన్యూ డివిజనల్ స్థాయిలో పరిష్కారం లభిస్తుందని, కోర్టులను ఆశ్రయించాల్సిన పని ఉండదని ఆయన తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయేతర భూములకు ఈ చట్టం వర్తిస్తుందని, ప్రతి కమతంకు భూ ఆధార్ కార్డు అందించి భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు ఆయన వివరించారు.

త్వరలో గ్రామపాలన అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక భూ భారతి అని ఈ చట్టంతో ప్రతి భూ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం 55 మంది లబ్ధిదారులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన 44 లక్షల రూపాయల విలువచేసే బోర్ మోటార్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వినయ్ సాగర్, ఏవో అరుణకుమారి, టీపీసీసీ కార్యదర్శి సూదిని రామ్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, డీటీ రాజశేఖర్, ఏఎంసి డైరెక్టర్లు పల్లె జంగయ్య గౌడ్, జగన్ గౌడ్, జగన్ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దయ్య యాదవ్, నాయకులు కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed