Greater Expansion: ఔటర్ వరకు గ్రేటర్ విస్తరణ.. గ్రామ పంచాయతీలు రద్దు!

by Shiva |
Greater Expansion: ఔటర్ వరకు గ్రేటర్ విస్తరణ.. గ్రామ పంచాయతీలు రద్దు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధికి వెలుపల, ఔటర్ రింగు రోడ్డుకు లోపల ఉన్న గ్రామ పంచాయతీలు రద్దు కానున్నాయి. వాటిని డీనోటిఫై చేసేందుకు సైతం పంచాయతీరాజ్ శాఖలో కసరత్తు జరుగుతున్నది. దీంతో అవన్నీ సమీపంలో ఉన్న మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం కానున్నాయి. ఒకవేళ విలీన ప్రక్రియలో ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నట్లయితే వాటన్నింటినీ కలిపి ఒక క్లస్టర్‌గా భావించి కొత్త మున్సిపాలిటీని క్రియేట్ చేయడంపైనా చర్చలు సాగుతున్నాయి. ఎలాగూ గ్రామ పంచాయతీల గడువు పూర్తికావడంతో ఎన్నికైన బాడీలతోనూ లీగల్ చిక్కులకు ఆస్కారం లేకుండాపోయింది. సీఎం అధ్యక్షతన నేడు (ఆగస్టు 1న) జరగబోయే కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించేందుకు వీలుగా పంచాయతీరాజ్ డిపార్టుమెంటుతో పాటు పురపాలక శాఖ డైరెక్టర్ సైతం నిర్దిష్టమైన ప్రతిపాదనలతో నోట్ ఫైల్‌ను పంపించడానికి రంగం సిద్ధమైంది.

2 వేల చ.కి.మీ మేరకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకూ విస్తరించడంపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆ శాఖ అధికారులతో రివ్యూ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధి ప్రస్తుతం ఉన్న 630 చ.కి.మీ. నుంచి దాదాపు 2000 చ.కి.మీ. మేరకు విస్తరించనున్నది. ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తుండడంతో తన ఆలోచనలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ లిమిట్‌ను ఓఆర్ఆర్ వరకూ విస్తరించడంపై అధికారులకు సూచనలు చేశారు. అనుకూల, ప్రతికూల అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని గతంలోనే వారికి సూచించారు.

ఆ ప్రకారం అధికారులు కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. జీహెచ్ఎంసీ స్థానంలో యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీని ఏర్పాటు చేయడంలోని సాధ్యాసాధ్యాలను వివరించారు. వీటిపై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత అన్ని పార్టీల, ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోడానికి బదులుగా అసెంబ్లీలోనే చర్చించి సభ్యులందరి నుంచి అభిప్రాయాలను తెలుసుకుని చట్టం చేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నది. అందులో భాగంగా జీహెచ్ఎంసీకి వెలుపల ఓఆర్ఆర్ లోపల ఉన్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల విలీన ప్రక్రియ ఎలా జరగాలన్నదానిపై ఆ రెండు శాఖల అధికారులు ముసాయిదా బిల్లు రూపంలో ప్రభుత్వానికి వివరించనున్నారు.

కేబినెట్ సమావేశంలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నందున మొత్తం 33 గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేయడం, వాటిని సమీపంలోని మున్సిపాలిటీల్లో కలపడంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం వారి అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలిపారు. మున్సిపాలిటీల్లో విలీనం చేయడంలోని సాధక బాధకాలనూ పురపాలక శాఖ డైరెక్టర్.. కేబినెట్ సమావేశానికి ఒక నోట్ రూపంలో వివరించారు. ఈ రెండు శాఖల అభిప్రాయాలను మంత్రులంతా చర్చించిన తర్వాత ప్రభుత్వం తదుపరి యాక్షన్ ప్లాన్‌పై ఫోకస్ పెట్టనున్నది.

27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సైతం..

జీహెచ్ఎంసీ పరిధికి వెలుపల మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 27 మున్సిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా పరిధిలో బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్, పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్లుగా ఉంటే దమ్మాయిగూడ, దుండిగల్, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, కొంపెల్లి, మేడ్చల్, నాగారం, పోచారం, తూంకుంట మున్సిపాలిటీలుగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్ మునిసిపల్ కార్పొరేషన్లుగా ఉంటే ఆదిభట్ల, జల్‌పల్లి, మణికొండ, నార్సింగి, పెద్ద అంబర్‌పేట, శంషాబాద్, తుక్కుగూడ, తుర్కయంజల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో కార్పొరేషన్లు లేకపోయినా అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త వ్యవస్థ ఏర్పాటుతో ఇవన్నీ అందులో భాగం కానున్నాయి.

ఒకే క్లస్టర్‌గా కొత్త మున్సిపాలిటీ!

ఓఆర్ఆర్ గవర్నెన్స్ ప్లాన్‌లో భాగంగా పురపాలక శాఖ డైరెక్టర్‌కు ఇటీవల ఇంటెర్నల్ సర్క్యూలర్ వెళ్లింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంపై ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వివరణ ఇచ్చారు. కొన్ని అంశాలను నివేదిక రూపంలో సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. ఈ కొత్త ప్రాసెస్ లీగల్ చిక్కుల్లేకుండా సజావుగా సాగేందుకు వీలుగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం ప్రక్రియను కంప్లీట్ చేయడానికి సంబంధించిన నిర్దిష్ట ప్రతిపాదనలను రెడీ చేయాలని పేర్కొన్నారు. నేడు కేబినెట్ భేటీ జరుగుతున్నందున ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ముందుగానే ప్రతిపాదనలు అందాలంటూ నొక్కిచెప్పారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనున్నందున అప్పటికల్లా ముసాయిదా బిల్లు రెడీ చేస్తే దానిని సభ్యుల చర్చ కోసం టేబుల్ చేయాల్సి ఉంటుందనే సంకేతాన్ని ఇచ్చారు. అదే సమయంలో ఓఆర్ఆర్ పరిధిలో 33 గ్రామ పంచాయతీలు సైతం ఉన్నందున వీటిని సైతం కొత్త వ్యవస్థలో భాగం చేసేలా పంచాయతీరాజ్ డిపార్టుమెంటుకు సైతం తగిన ఆదేశాలు వెళ్లాయి. ఎలాగూ గ్రామ పంచాయతీల గడువు ముగిసిపోయి ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నందున లీగల్ చిక్కులు సైతం ఉండవన్నది ప్రభుత్వ భావన. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో వారి నుంచి అభ్యంతరాలూ వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వాటిని డీనోటిఫై చేయాల్సిందిగా ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

వాటిని డీనోటిఫై చేస్తే గ్రామ పంచాయతీలుగా మనుగడలో ఉండే అవకాశమే లేకపోవడంతో అనివార్యంగా అవి పక్కనే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం అవుతాయి. ఈ ప్రక్రియలో ఇబ్బందులేమైనా ఉన్నట్లయితే ఆ గ్రామపంచాయతీలన్నింటినీ ఒకే క్లస్టర్‌గా భావించి కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేయడంపైనా ఆదేశాలు వెళ్లాయి. ఏక కాలంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలను కొత్తగా ఉనికిలోకి రాబోతున్న మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసే దిశగా సర్కారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే విపత్తు నిర్వహణ విభాగం పరిధిని ఓఆర్ఆర్ వరకూ విస్తరిస్తూ దానికి ‘హైడ్రా’ అనే పేరు పెట్టి ప్రత్యేక పాలనా వ్యవస్థను ప్రభుత్వం నెలకొల్పింది. ఈ కేబినెట్ భేటీలో చర్చకు అనుగుణంగా త్వరలో కొత్త మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై మరింత క్లారిటీ రానున్నది.

Advertisement

Next Story