KVP: నా స్వంత ఖర్చులతోనే నేలమట్టం చేస్తా

by Gantepaka Srikanth |
KVP: నా స్వంత ఖర్చులతోనే నేలమట్టం చేస్తా
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫామ్ హౌజ్ నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే స్వంత ఖర్చులతో 48 గంటల్లో కూల్చివేస్తానని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై పైసా భారం కూడా పడనివ్వకుండా కూల్చివేత మొదలు శిథిలాలను శుభ్రం చేసేంతవరకు అన్నింటినీ తానే భరిస్తానని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని, సీఎం భుజం మీద తుపాకీ పెట్టి తనను కాల్చాలని వారు భావిస్తున్నారని, తద్వారా సీఎం రేవంత్‌ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కేవీపీ పలు అంశాలను ప్రస్తావించారు. అజీజ్‌నగర్ ఫామ్ హౌజ్‌ నిర్మాణంలోని ఒక్క అంగుళం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లు అధికారులు ధృవీకరిస్తే స్వచ్ఛందంగా కూల్చడానికి సిద్ధమని ఇటీవల చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు నొక్కిచెప్పారు.

బీఆర్ఎస్ నాయకులు రాజకీయ స్వార్థం కోసం పదేపదే తన ఫామ్ హౌజ్‌ నిర్మాణంపై ఆరోపణలు చేస్తున్నారని, వారి పార్టీ ఉనికి కోసం ఆధారాలు లేని అంశాన్ని ప్రచారం చేస్తున్నారని కేవీపీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఫామ్ హౌజ్‌ నిర్మాణం ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉన్నట్లు అధికారులు అక్కడికి వచ్చి మార్కింగ్ చేయాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలను, వారి అనుకూల మీడియాను కూడా ఆ సమయానికి అక్కడికి చేరుకునేలా ముందుగానే తనకు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆ లేఖలో కోరారు. ఇది సూచన మాత్రమేనని, స్వయంగా కళ్లారా ఆ మార్కింగ్ ప్రక్రియను ఆ నేతలు చూసేందుకు వీలుగానే ఈ రిక్వెస్టు చేస్తున్నానని సీఎం రేవంత్‌కు కేవీపీ వివరించారు. హైదరాబాద్‌లో తనకు 1980 నుంచి స్థిర నివాసం ఉన్నదని, ప్రతీ ఎన్నికలోనూ అక్కడే ఓటు వేస్తున్నానని గుర్తుచేశారు.

వైఎస్సార్ వెంట కలిసి నడిచిన సమయంలోనే (1996లో) తన అంతరాత్మ సాక్షిగా ఒక నిర్ణయం తీసుకున్నానని గుర్తుచేశారు. ప్రాంతాలకు అతీతంగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని, పార్టీకి ఎలాంటి నష్టం కలిగించే పని చేయనని అప్పట్లోనే స్పష్టం చేశానని గుర్తుచేశారు. 1980వ దశకంలో ఇందిరాగాంధీ హయాం నుంచి పార్టీతోనే కొనసాగుతున్నానని, దాదాపు 50 ఏండ్లుగా ఏఐసీసీ సభ్యుడిగా కంటిన్యూ అవుతున్నానని, ఇప్పటికీ అదే స్టాండ్‌కు కట్టుబడి ఉన్నానని కేవీపీ ఆ లేఖలో నొక్కిచెప్పారు. ఊపిరి ఉన్నంతవరకూ ఇదే వైఖరితో ఉంటానని తెలిపారు. ఈ కారణంగానే తన ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ విషయంలో ప్రభుత్వం తనకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదని, సాధారణ పౌరుల లాగానే తనపట్ల కూడా వ్యవహరించాలని, చట్టం తన పని తాను చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సీఎంకు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ తీసుకునే నిర్ణయానికి తన వైపు నుంచి ఎలాంటి చెడ్డపేరు రాకుండా వ్యవహరిస్తానని తెలిపారు. నరనరానా కాంగ్రెస్ రక్తమే ఉన్నందున పార్టీకి డ్యామేజ్ కలగనివ్వనని పేర్కొన్నారు. నిజానికి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కాంగ్రెస్‌కు అత్యంత ఇష్టమైనది, ప్రాధాన్యతతో కూడుకున్నదని, వైఎస్సార్ సీఎం అయిన తర్వాత దీనిపై దృష్టి పెట్టారని గుర్తుచేశారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ను పిలిపించుకుని మంచి మార్గాన్ని సూచించాల్సిందిగా సీఎం హోదాలో వైఎస్సార్ కోరిన సమావేశంలో తాను కూడా పాల్గొన్నానని గుర్తుచేశారు. సేవ్ మూసీ పేరుతో 2005 ఆగస్టు 24న రూ. 908 కోట్ల అంచనాతో ఒక పథకం వైఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభమైందని వివరించారు. మూసీ ప్రక్షాళనతో నష్టపోయే కుటుంబాలకు సంతృప్తికరమైన పునరావాసం, నష్టపరిహారం కల్పించడానికి ఎక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో వైఎస్సార్ కొనసాగించలేకపోయారని, రెండో టర్ములో గాడిన పెట్టాలని ఆయన భావించినా ఆకస్మికంగా చనిపోవడంతో పక్కకు పోయిందని, తాను కూడా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేకపోయామని బాధ పడ్డానని గుర్తుచేశారు.

ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ ప్రాజెక్టును చేపట్టిందని, దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నానని కేవీపీ పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనను ఫస్ట్ ఫేజ్‌గా, సుందరీకరణను సెకండ్ ఫేజ్‌గా చేపడితే మంచిదనే సూచనలు తన దృష్టికి వచ్చాయని, దీన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌ను కోరారు.

Advertisement

Next Story

Most Viewed