Haryana elections: రేపే హర్యానా అసెంబ్లీ పోరు.. వినేష్ ఫొగట్ పైనే అందరి దృష్టి

by vinod kumar |   ( Updated:2024-10-04 15:24:34.0  )
Haryana elections: రేపే హర్యానా అసెంబ్లీ పోరు.. వినేష్ ఫొగట్ పైనే అందరి దృష్టి
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇందుకు గాను ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 930 మంది పురుషులు ఉండగా..101 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 2.03 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా రాష్ట్ర వ్యాప్తంగా 20,629 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 30 వేల మంది పోలీసులు, 225 పారామిలటరీ బలగాలను మోహరించారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కూడా నిఘా పెట్టారు.

వినేష్ ఫొగట్‌పైనే అందరి దృష్టి

హర్యానా ఎన్నికలపై ఈ సారి ఎన్నడూ లేనంత ఆసక్తి నెలకొంది. గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరి జులనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ పైనే అందరి దృష్టి ఉంది. ఆమె ఎన్నికల్లో విజయం సాధిస్తుందా లేదా అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అలాగే ఇతర ప్రముఖ అభ్యర్థుల్లో సీఎం నయాబ్ సింగ్ సైనీ, ప్రతిపక్ష నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, అనిల్ విజ్ తదితరులు ఉన్నారు. కాగా, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే రాష్ట్రంలో పోటీ నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీఎస్పీ ఇతర పార్టీలు 20 స్థానాల్లో ప్రభావం చూపగలవని అంచనా వేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం జమ్మూ కశ్మీర్, హర్యానా రెండు ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ శనివారం సాయంత్రం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా 2019 ఎన్నికల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. పలువురు స్వత్రంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతు తెలపగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, ఈ నెల 8న హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed