నక్సలైట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

by Kalyani |
నక్సలైట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
X

దిశ, వనపర్తి : నక్సలైట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ.. డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ… సులభంగా డబ్బులు సంపాదించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా,కోనరావుపేట మండలం, మామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి అలియాస్ ప్రమోద్ రెడ్డి అనే వ్యక్తి మాజీ నక్సలైట్ గా చెప్పుకుంటూ అడ్డదారిలో డబ్బులు వసూలు చేసే మార్గం ఎంచుకున్నాడు. తాను మాజీ నక్సలైట్ గా చెప్పుకొని వనపర్తి జిల్లా సోలిపూర్ గ్రామానికి చెందిన తేనేటి శేఖర్ రెడ్డికి ఫోన్ చేసి రైస్ మిల్లు అసోసియేషన్ నుండి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు వెంటనే ఇవ్వకుంటే మిమ్మల్ని చంపుతానని చెప్పి బెదిరించాడు.

తేనేటి శేఖర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఘనపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి సుదర్శన్ రెడ్డి కోసం గాలిస్తుండగా ఖిల్లాఘణపురం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసు విచారణలో నిందితుడు తను చేసిన నేరం ఒప్పుకున్నాడు. గతంలో సుదర్శన్ రెడ్డి ఆత్మరక్షణ మేరకు గన్ లైసెన్స్ తీసుకొని అక్కడ నుంచి హైదరాబాదులోని ముషీరాబాద్ 2000 సంవత్సరంలో వచ్చి చార్మినార్ లో వెపన్ 3.2 రివాల్వర్ కొనుగోలు చేశాడు. ఒక సంవత్సరం నుండి హబ్బిగూడలో అపార్ట్మెంట్ లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ,రివాల్వర్ చూపించి చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసేవాడు.

ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ వర్క్ ప్రారంభించాడు. 2015 నుంచి అతనికి వ్యాపారంలో అప్పులు కావడంతో ఎలాగైనా ఆర్థికంగా ఎదగాలని, చేసిన అప్పులను తీర్చాలనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్న రివాల్వర్ చూపించి బెదిరించి రూ.15 లక్షల ఇవ్వాలని పెద్దపల్లిలోని ఒక రైసుమిల్ ఓనర్ ని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. సుల్తానాబాద్, కరీంనగర్, సుబేదారి, మిర్యాలగూడ, వంటి ఏరియాల్లో కూడా కొంతమందిని డబ్బులు ఇవ్వాలని బెదిరించి, అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు. ఈ కేసును ఛేదించిన కొత్తకోట సీఐ రాంబాబు,ఖిలా ఘనపూర్ ఎస్సై సురేష్, పోలీస్ కానిస్టేబుల్ లింగం, రాజులను జిల్లా ఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed