‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి రావొచ్చు’.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓపెన్ ఆఫర్

by Satheesh |   ( Updated:2024-06-25 12:03:32.0  )
‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి రావొచ్చు’.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓపెన్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటీకి క్యూ కడుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడటంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. పోచారం, సంజయ్ పార్టీ ఫిరాయింపుపై పిటిషన్ ఇవ్వడానికి స్పీకర్‌ను సమయం కోరామని తెలిపారు.

ఈ రోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారని వెల్లడించారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరి సభ్యత్వాలు రద్దు కావాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్ సమయం ఇస్తారని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతుంటే, ఫిరాయింపులపై రాహుల్ బీజేపీపై దాడి చేస్తుంటే ఇక్కడ రేవంత్ బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఏ ఒక్కరినీ మేము వదిలిపెట్టమని, ప్రజల ముందు దోషిగా నిలబెడతామని తేల్చి చెప్పారు. స్పీకర్ న్యాయంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

రేవంత్ భయంలో ఉన్నాడని, కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పదవిని కాపాడుకోవటానికి రేవంత్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. దివంగత కాంగ్రెస్ సీఎం రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు తీర్పు తర్వాతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి రావొచ్చని జగదీష్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. విద్యుత్ కొనుగోళ్లపై పవర్ కమిషన్ విచారణ వద్దనటం లేదు.. జస్టిస్ నర్సింహ రెడ్డిని తప్పించాలని కోరుతున్నామని క్లారిటీ ఇచ్చారు. విచారణలో అన్ని తేటతెల్లం అవుతాయని.. కేసీఆర్ మల్లె పూవులా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story