Flood Donations: వరద బాధితులకు నెల వేతనం విరాళం! బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం

by Shiva |   ( Updated:2024-09-04 15:49:34.0  )
Flood Donations: వరద బాధితులకు నెల వేతనం విరాళం! బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాలు, వరదల సమయంలో అధికార పార్టీపైనా, ప్రభుత్వంపైనా వరుస విమర్శలు చేసి అపవాదును మూటగట్టుకున్న బీఆర్ఎస్.. డ్యామేజ్ కంట్రోల్ దిశగా అడుగులేస్తున్నది. పార్టీ ప్రెసిడెంట్ సైలెంట్‌గా ఉండిపోవడం, వర్కింగ్ ప్రెసిడెంట్ వరుస ట్వీట్‌ మెసేజ్‌లతో ఆ పార్టీ విమర్శలపాలైంది. ఒకరిద్దరి వ్యవహారంతో మొత్తం పార్టీకే చెడ్డపేరు వచ్చిందని భావించి మంగళవారం బాధిత ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేసింది. ఇది మాత్రమే సరిపోదని భావించి ప్రభుత్వానికి సహకారమందిస్తామని, అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని ఆఫర్ ఇచ్చింది. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చి బాధిత కుటుంబాలకు అందేలా చేయాలని భావిస్తున్నది. ఒకటి రెండు రోజుల్లో పార్టీ తరఫున లాంఛనంగా ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం.

కేటీఆర్ ట్వీట్లు.. పార్టీకి చేటు..!

మూడు రోజులుగా కేటీఆర్ ట్వీట్ల పేరుతే ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, గతంలోని అంశాలను తవ్వితీయడం ఆ పార్టీకి మేలు కంటే చేటు ఎక్కువ చేసిందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వినిపించింది. పార్టీ సీనియర్ల నుంచి వెళ్లిన సూచన మేరకే మంగళవారం నుంచి ట్వీట్ల స్వభావాన్ని మార్చారని, ప్రభుత్వంపై విమర్శల జోరు తగ్గించారని తెలిసింది. అమెరికాలో ఉంటూ ట్వీట్ రూపంలో ఘాటు మెసేజ్‌లు పెట్టడం ద్వారా స్థానికంగా తిరిగే నేతలకు చిక్కులు ఎదురవుతున్నాయని, పార్టీ పరిస్థితిని మెరుగుపర్చుకోడానికి బదులు మరింత డ్యామేజ్ జరుగుతోందని వారి అభిప్రాయం. ఆ నష్ట నివారణ చర్యల్లో భాగమే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు వరద బాధిత ప్రాంతాల్లో తిరిగి ప్రజలకు తక్షణ సాయాన్ని అందజేశారు. పార్టీ తరఫున కూడా స్థానిక నేతల ద్వారా దీన్ని మరికొన్ని రోజులు కంటిన్యూ చేయాలని ఆలోచిస్తున్నారు.

నెల వేతనం ఇవ్వడానికి మొగ్గు

ఇంకోవైపు ఈ డ్యామేజ్‌ను మరింతగా కంట్రోల్ చేసుకోడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల వేతనాన్ని బాధిత కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడిన తర్వాత పార్టీ నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకుని ప్రకటన చేయనున్నది. ఇతర పార్టీలు ఇలాంటి ప్రకటన చేయడానికి ముందే బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నది. కేసీఆర్, కేటీఆర్ తీరుతో పార్టీ నేతలకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు జరగడం, ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు కౌంటర్‌ల రూపంలో రియాక్షన్‌ను గులాబీ నేతలు పసిగట్టారు. ప్రజల్లో పల్చన అవుతున్నట్లు అర్థమైందని, దాన్ని పూడ్చుకోవడం తక్షణ కార్యాచరణగా మారిందన్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో చవిచూసిన ఓటమి నేపథ్యంలో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ప్రజల అభిమానాన్ని చూరగొనాలని భావిస్తున్న తరుణంలో కేటీఆర్ ట్వీట్స్ ఆ పార్టీ నేతలకు కక్కలేని, మింగలేని స్థితిని తీసుకొచ్చాయి. మరోవైపు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం తమ నెల రోజుల వేతనాన్ని విరాళం ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలిసింది.

ఉద్యోగుల భారీ విరాళం (బాక్స్)

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన నెల వేతనాన్ని చెక్కు రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. అలాగే.. అన్నిస్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకరోజు ‘బేసిక్ పే’ను డొనేషన్‌గా ప్రకటించారు. దాదాపు రూ.130 కోట్ల మేర జమ అయ్యే ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాల్సిందిగా నేరుగా ముఖ్యమంత్రికే నమూనా చెక్కును, ఉద్యోగుల జేఏసీ తరఫున తీసుకున్న నిర్ణయం కాపీని అందజేశారు. మరోవైపు సెప్టెంబరు నెల వేతనం (అక్టోబరు 1వ తేదీన అందుకోనున్న)లో ఒక రోజు ‘బేసిక్ పే’ను మినహాయించుకోవాల్సిందిగా చీఫ్ సెక్రెటరీకి ఉద్యోగుల జేఏసీ రాతపూర్వకంగా సమ్మతిని తెలియజేసింది.

Advertisement

Next Story