Flood Damage: వరద నష్టంపై కేంద్రానికి నివేదిక..! రూ.2వేల కోట్ల తక్షణ సాయంకు విజ్ఞప్తి

by Shiva |   ( Updated:2024-09-03 15:38:09.0  )
Flood Damage: వరద నష్టంపై కేంద్రానికి నివేదిక..! రూ.2వేల కోట్ల తక్షణ సాయంకు విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాల వల్ల తలెత్తిన నష్టాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ ప్రాథమిక నివేదికను పంపించినట్టు తెలుస్తున్నది. రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదికను తయారు చేసి హోంశాఖకు పంపినట్టు సమాచారం. తక్షణ సాయం కింద రూ.2 వేల కోట్లను అందించాలని కోరుతూ, పరిశీలన కోసం కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు.

దాదాపు రూ.5.5 వేల కోట్ల నష్టం

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల సుమారు రూ.5.5 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆఫీసర్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వరద ప్రభావం వల్ల జరిగిన పంటనష్టం, దెబ్బతిన్న ఇండ్లు, కొట్టుకుపోయిన ఇరిగేషన్ కాలువలు, రోడ్లు, పాడైన విద్యుత్ కనెక్టివిటీ వివరాలను రిపోర్టులో పేర్కొన్నట్టు సెక్రెటేరియట్ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేంద్ర హోంశాఖకు పంపారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లేముందు సీఎం రేవంత్ వర్షాల వల్ల జరిగిన నష్టంపై అంచనాలు తయారుచేయాలని అదేశించడంతో సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖలకు చెందిన ఆఫీసర్లతో సమీక్ష జరిపి.. రిపోర్టు తయారు చేసినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా ఖమ్మం సిటీ, ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రిపోర్టులో ప్రధానంగా పేర్కొన్నట్టు సమాచారం. వర్షాల వల్ల మరణించిన బాధిత కుటుంబ వివరాలను సైతం రిపోర్టులో చేర్చినట్టు తెలిసింది.

ఢిల్లీకి రాష్ట్ర ఆఫీసర్ల బృందం!

క్షేత్రస్థాయిలో పర్యటించి, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని సీఎం రేవంత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు లిఖిత పూర్వకంగా సీఎస్ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. అలాగే నష్టం వివరాలను స్వయంగా కేంద్రానికి అందించి, ఆర్థిక సాయం చేయాలని కోరేందుకు రెండు మూడు రోజుల్లో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లే చాన్స్ ఉందని సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది.

Advertisement

Next Story