ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ చూసుండరు.. మామిడి తోటలో వైభవంగా కల్యాణం (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-09-01 15:23:16.0  )
ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ చూసుండరు.. మామిడి తోటలో వైభవంగా కల్యాణం (వీడియో)
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: పచ్చని పందిళ్లు.. బంధుమిత్రుల సందడి.. వేద పండితుల మంత్రాలతో ఓ జంట ఏకం కావడంసాధారణ విషయం.. అక్కడక్కడా పశువులకు, జంతువులకు కూడా పెళ్లిళ్లు చేయడం చూస్తుంటాం. కొన్ని పండగల సమయంలో రావి చెట్టు.. వేప చెట్టుకు పెళ్లి చేయడమూ చూశాం.. కానీ వింతగా మామిడి చెట్లకు పెళ్లి చేయడం అరుదు. తాజాగా.. ఓ రైతు మామిడి చెట్లకు పెళ్లి చేసి చర్చనీయాంశంగా మారాడు. ఈ ఘటన సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా తూరుపుట్టి గ్రామపంచాయతీ పరిధిలోని రామ్‌రెడ్డిపల్లి తండాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన బాలు నాయక్‌ అనే రైతుకు నలుగురు అన్నాదమ్ములు ఉన్నారు. వీరికి తండాలో పదెకరాల పొలం ఉంది. ఆ పొలంలో ఐదు వందలకు పైగా మామిడి మొక్కలను నాటి పెంచారు. అవి ఈ ఏడాది కాత కాశాయి.

ఈ ఆనందంలో అన్నదమ్ములు బంధుమిత్రులను ఆహ్వానించి తమ పొలంలో ఉన్న ఐదు జంట మామిడి చెట్లకు యువతీ యువకులకు పెళ్లిళ్లు చేసినట్లుగా సాంప్రదాయ రీతిలో ఘనంగా వివాహం జరిపించారు. నూతన వస్త్రాలు ధరించి.. అన్నదమ్ములు ఐదుగురు, వారి భార్యలు కలిసి ఐదు జంట మామిడి చెట్లను నూతన వస్త్రాలతో అలంకరించి.. బాసింగాలు కట్టి.. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వివాహం చేశారు. అనంతరం వివాహానికి హాజరైన బంధువులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఆ తర్వాత బంధువులకు పెళ్లి(వన) భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను గురించి విన్నవారు.. చూసినవారు కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంటే.. మరికొందరు బాలు నాయక్ కుటుంబ సభ్యులకు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ పట్ల అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి: శ్రీరామనవమి.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!

Advertisement

Next Story