దేశంలోని ప్రతి గ్రామం భారతీయ జీవన విధానానికి ప్రతిబింబం: మంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |   ( Updated:2023-02-07 18:19:28.0  )
దేశంలోని ప్రతి గ్రామం భారతీయ జీవన విధానానికి ప్రతిబింబం: మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని ప్రతి గ్రామం భారతీయ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాచీనకాలం నుంచే భారతదేశ గ్రామాల్లో ప్రకృతి రమణీయతతోపాటుగా సాధికారత, ప్రజాస్వామ్య విధానాలు స్పష్టంగా కనబడతాయన్నారు. గుజరాత్‌లోని భుజ్ జిల్లాలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం 'రణ్ ఆఫ్ కచ్'లో బుధవారం జరగనున్న జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ప్రారంభసూచకంగా మంగళవారం జరిగిన 'గ్రామీణ పర్యాటక సదస్సు: సమాజ సాధికారత, పేదరిక నిర్మూలన' అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే గ్రామాల్లో.. క్రీస్తుశకం 715లోనే భారతదేశంలో స్థానికంగా రాసుకున్న రాజ్యాంగం అమల్లో ఉండేదని గుర్తుచేశారు. తమిళనాడులోని ఉత్తిరమేరుర్ గ్రామంలో గ్రామసభ, రాజ్యాంగం అమల్లో ఉండేవని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ, పోటీచేసే అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల పదవీకాలం తదితర అంశాలు అందుబాటులో ఉండేవన్నారు.

గ్రామాలకు పునర్వైభవాన్ని తీసుకొచ్చి.. ఈ ప్రాంతాల్లో పర్యాటకాన్ని వృద్ధి చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇప్పటికీ భారతదేశ పర్యాటకం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉందన్నారు. అగ్రి టూరిజం, గ్రీన్ టూరిజం, వైల్డ్ లైఫ్ టూరిజం, కల్చర్ టూరిజం, క్విజిన్ బేస్డ్ టూరిజం, హ్యాండీక్రాఫ్ట్ టూరిజం, ఫెస్టివల్ టూరిజం తదితర రంగాల పర్యాటకాన్ని ప్రోత్సహించాలని జీ20 సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యాటక సంస్థ టూరిజం మార్కెటింగ్ చీఫ్ సాండ్రా కార్వావో, ఇండొనేషియా డిప్యూటీ చీఫ్ ఆఫ్ కమిషన్ మస్ని ఎరిజా, ఇటలీ పర్యాటక శాఖ మెంబర్ మెలీనా పియాజెంట్, స్పెయిన్ పర్యాటక శాఖ డైరెక్టర్ ఎలీసా ఫ్రాగా, జపాన్ పర్యాటక శాఖకు చెందిన సునషిగె షిరొతోరి, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఇండియా హెడ్ అతుల్ బగాయ్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సుదీప్త భద్ర తదితరులు గ్రామీణ పర్యాటకాభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.


తెలంగాణ బడ్జెట్-2023లో చేనేతకు మిగిలేది గుండుసున్న: వెంకట్రాములు ఫైర్

Advertisement

Next Story