AP News:కొత్త సంవత్సరంలో ఉద్యోగాల వెల్లువ.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:కొత్త సంవత్సరంలో ఉద్యోగాల వెల్లువ.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగాల వెల్లువ, గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించడం ఖాయమని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. బూడిద కుప్పల నుంచి ప్రాణం పోసుకునే ఫీనిక్స్‌ పక్షిలా అమరావతి మళ్లీ ఉదయిస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2025కు స్వాగతం పలుకుతూ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ట్విట్టర్ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

2024 సంవత్సరం రాష్ట్రంతో పాటు భారతదేశం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి లాంటిదని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. 2024 ఎన్నికల్లో, ఏపీ ప్రజలు ప్రజా, అభివృద్ధి వ్యతిరేక, దురహంకార, అవినీతి పాలనకు తగిన గుణపాఠం చెప్పారని, సంఘ వ్యతిరేక శక్తుల్ని దిమ్మ తిరిగేలా తిప్పికొట్టారని స్పష్టం చేశారు. న్యాయమైన పరిపాలన, శ్రేయస్సు, మెరుగైన, సురక్షితమైన భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల్లో వచ్చిన ప్రజాస్వామ్య విప్లవమే 2024 ఎన్నికల ఫలితాలు అని అభివర్ణించారు.

ప్రజలు ఆకాంక్షించే బంగారు భవిష్యత్తుకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌‌లు అండగా నిలుస్తారని భరోసానిచ్చారు. గత 6 నెలలుగా ఏపీలో, కేంద్రంలో జరుగుతున్న పరిపాలన, అమలవుతున్న కార్యక్రమాలే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వివరించారు. అమరావతి పునర్వైభవం సంతరించుకుంటుందని, పోలవరం సాకారం కాబోతోందని తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయనీ, అతి త్వరలో ఉద్యోగాల వెల్లువను చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 2025లో ప్రజలు ఆరోగ్యంగా, సంపన్నులుగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ట్వీట్‌ ద్వారా ఆకాంక్షించారు.

Advertisement

Next Story