వలస కూలీల పై నిఘా ఏది ?

by Sumithra |
వలస కూలీల పై నిఘా ఏది ?
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో వలస కార్మికుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వలస కూలీలు భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు, బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి మండలం, యాదగిరిగుట్టతో పాటు ఆయా మండల కేంద్రాలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఉంటూ గృహ నిర్మాణ పనులు, పరిశ్రమలు, ఆయా దుకాణాలు, హోటల్స్ లలో పనులు చేస్తున్నారు.

జిల్లా‌ కేంద్రంలో అధికంగా...

ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వలస కూలీలు జిల్లా కేంద్రంలో తిష్ట వేశారు. పట్టణంలోని చాల‌ కాలనీలలో అయిదారుగురు కూలీలు కలిసి ఒక చిన్న గది అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రతి నిత్యం ఉదయం పట్టణంలోని జగదేవపూర్ చౌరస్తా వద్దకు వచ్చి వేచి చూస్తారు. కూలీలంతా ఇక్కడికే వచ్చి పని కోసం నిలబడతారు. ఎవరికైతే పని అవసరం ఉంటుందో వారు వచ్చి వీరితో కూలి మాట్లాడుకుని తీసుకొని వెళ్తుంటారు. మరి కొంత మంది ఒక కాంట్రాక్టర్ కింద పని చేస్తూ ఉంటారు.‌ ఆ కాంట్రాక్టర్ అవసరమున్నవారితో పనికి మాట్లాడుకుని తన కింద ఉన్న కూలీలను పంపుతుంటారు.

మరి కొంత మంది దుకాణాలు, హోటళ్లలో...

ఇలా కొంత మంది కూలీలు రోజువారి పనికి బయటికి వెళ్తుండగా, మరి కొంత మంది జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, ఇతర గ్రామాలలో పలు రకాల దుకాణాలలో, హోటల్లలో పరిశ్రమలలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా బయట నుంచి వచ్చే వారి వివరాలు స్థానికంగా ఏ శాఖ అధికారులు సేకరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

సమాచార సేకరణ‌పై కొరవడిన స్పష్టత....

ఇలా వలస కూలీల చిరునామా, ఆధార్ కార్డులు, ఇతరత్రా వివరాలు ఏ అధికారులు సేకరిస్తున్నారని సమాచారం పై స్పష్టత కొరవడుతుంది. మరోవైపు ఇల్లు అద్దెకు ఇచ్చే ఇంటి ఓనర్ల దగ్గర అయినా వీటికి సంబంధించిన సమాచారం ఉందా లేదా అనేది కూడా స్పష్టత లేదు. ఇంకా కొన్ని పరిశ్రమలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మైనర్లు కూడా పనిచేస్తున్నారన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారికి గురించిన సమాచార సేకరణ ఎలా జరుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వెంటనే వారి స్వస్థలాలకు వెళ్లిపోతే వారిని పట్టుకోవడం కూడా ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. ఉపాధి హామీ పేరిట సొంతూరిని వదిలి ఇక్కడికి వస్తున్న కార్మికులు నిత్యం పని కోసం లేబర్ అడ్డా వద్ద ఎదురు చూస్తుంటారు. అడ్డా మీద దొరికిన పనికి వెళ్తుంటారు. ఇలా పనిచేస్తున్న వారి వివరాలు జిల్లాలో ఏ శాఖ వద్ద స్పష్టంగా లేవు. ఫలితంగా స్థానిక కూలీల గురించి అందరికి తెలిసినప్పటికీ.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి గురించి ఎవరికీ తెలియడం లేదు.

వ్యసనాలకు బానిసలుగా...

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల్లో అనేక మంది వ్యసనాలకు బానిసలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం లేవగానే తంబాకు, గుట్కా, గంజాయి, మద్యం సేవించి పనికి వెళ్తుంటారని, మత్తులోనే పనిచేస్తుంటారని తెలుస్తోంది. జిల్లాకు బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కార్మికులు వలస వస్తున్నారు. వీరి సమాచారం పోలీసులు, కార్మిక శాఖ అధికారుల వద్ద లేదు.

తక్కువ కూలి.. ఎక్కువ పని...

స్థానిక కూలీలను పనిలోకి తీసుకుంటే ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు వారు కూలి అడుగుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి ఇచ్చిన వలస కూలీలను తక్కువ డబ్బులకు పనిలోకి తెచ్చుకుంటున్నారు. రోజుకు రూ.500 వరకు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. స్థానికులకు అయితే కనీసం రూ.800 ఇవ్వాల్సి రావడంతో వలసకూలీలతో పనులు చేయించుకునేందుకు భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, యజమానులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఇక్కడ వలస కూలీలకు పని దొరుకుతుండడంతో నిత్యం కొత్త వారు వచ్చి చేరుతున్నారు.

వలస కూలీల సమాచారం పై దృష్టి సారించాం : రాజేష్ చంద్ర, డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్

జిల్లాలో ఉన్న వలస కూలీల సమాచారం పై పోలీస్ శాఖ తరపున దృష్టి సారించాం. ఏ పరిశ్రమలు, హోటల్స్, రోజువారీ కార్యకలపాలలో ఇతర రాష్ట్రాలకు కూలీలు పనిచేస్తున్నారనే విషయాలతో పాటు వారిని పనికి తీసుకువెళ్లే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించే విషయంలో‌ నిమగ్నమయ్యాం. ఇతర‌ రాష్ట్ర కూలీలతో పాటు ఇక్కడి వారి పైన కూడా ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. దీంతో పాటు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే, దానిపై విచారణ చేపట్టి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed