హైవే పక్కన ఉన్న ఆలయాలు, గ్రామాలే వారి టార్గెట్..

by Sumithra |
హైవే పక్కన ఉన్న ఆలయాలు, గ్రామాలే వారి టార్గెట్..
X

దిశ, భిక్కనూరు : హైవే పక్కన ఉన్న రెండు ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడిన సంఘటన భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయంతో పాటు వనదుర్గ, పెద్దమ్మ ఆలయాల్లో ఛానల్ గేటు తాళాలను గుణపాలతో పగులగొట్టి లోనికి ప్రవేశించారు.

ఆలయంలోని పెద్దమ్మ అమ్మవారి మెడలో ఉన్న పుస్తె మట్టెలతో పాటు, బంగారు ముక్కుపుడక, వెండి కళ్ళు, నగదును అపహరించుకుపోయారు. అయితే గుణపంతో హుండీని పగలగొట్టేందుకు విఫలయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగినప్పటికీ, ఏం వస్తువులు అపహరించుకుపోయారన్నది తెలియ రాలేదు. ఈ మేరకు పెద్దమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని కంప్లైంట్ చేశారు. హైవే పక్కన ఉన్న ఆలయాలు, గ్రామాలు టార్గెట్ గా చేసుకొని మారణాయుధాలతో ఓ ముఠా ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story