రేవంత్.. నీ బండారం మొత్తం నాకు తెలుసు : ఎంపీ ఈటల రాజేందర్

by M.Rajitha |
రేవంత్.. నీ బండారం మొత్తం నాకు తెలుసు : ఎంపీ ఈటల రాజేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మొత్తం తనకు తెలుసని, కానీ తాను వ్యక్తి గతంగా వెళ్లబోనని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా సమాజ హితం కోసం కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే ఏర్పడినట్లు, తానే కొత్త సీఎం అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈటల చురకలంటించారు. గతంలో అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాతే పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారని రాజేందర్ గుర్తుచేశారు. ఎన్ కన్వెన్షన్ ఒకటి కూల్చి పెద్దలవి కూడా కులుస్తున్నామని చెప్పుకొస్తున్నారన్నారు. హైడ్రా పేద ప్రజల ఇళ్లకి నోటీసులు ఇస్తోందని, అల్వాల్ లో 56 ఏండ్లుగా ఉంటున్న 200 మందికి నోటీసులు ఇచ్చి హైడ్రా చిచ్చు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బోయినపల్లిలో స్థిరపడిన 200 మంది పేద ప్రజలకు నోటీసులు ఇచ్చారని ఈటల తెలిపారు. మొదటి సీఎం నుంచి ఇప్పటివరకు 70 ఏళ్లుగా మూడు పార్టీలే రాష్ట్రాన్ని పాలించాయని ఆయన చెప్పారు. ఏ పార్టీలు అధికారంలో ఉన్నపుడు అనుమతులు ఇచ్చారో రేవంత్ రెడ్డికి తెలియదా? అని ఈటల ప్రశ్నించారు. గతంలో తమ పార్టీకి చెందిన సీఎంలు, అధికారులు తప్పు చేశారని ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తప్పు జరిగిందని లెంపలు వేసుకోవాలన్నారు. శనివారం, ఆదివారం కోర్టులు ఉండవు కాబట్టి, ఆరోజుల్లోనే దొంగలు, బందిపోట్లలా వచ్చి హైడ్రా విధ్వంసాలకు పాల్పడుతోందన్నారు.


పేద ప్రజల జీవితాల్లో మట్టి పోసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని ఈటల ధ్వజమెత్తారు. హైడ్రాపై పేద ప్రజలు అడిగే ప్రశ్నలకి సీఎంకు సమాధానం చెప్పే దమ్ము ఉందా అని నిలదీశారు. ఇమ్లీ బస్ స్టేషన్, మెట్రో జంక్షన్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకోవాలని, అవి మూసీ నదిలోనే ఉన్నాయన్నారు. సరూర్ నగర్ చెరువు వద్ద సింగరేణి కాలనినీ ప్రభుత్వమే లే అవుట్ చేసి ఇచ్చిందనే విషయాన్ని మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. డల్లాస్ నగరంలా చేస్తా అని పాత ముఖ్యమంత్రి చెప్పారని, ఇప్పుడు రేవంత్ అదే చెప్తున్నారా అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రాజ్ భవన్ వద్ద వర్షం వస్తే పడవలు వేసుకునే పరిస్థితి ఉందన్నారు. తప్పు చేసిన అధికారుల లిస్ట్ తీసి చర్యలు తీసుకోవాలని, పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఈటల సూచించారు. పేదలకు అన్యాయం చేస్తే సహించబోనని, అంతగా కావాలంటే పేదలకు ఇండ్లు కట్టించి రేవంత్ మాట్లాడాలని ఈటల వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed