చదువుతో పాటు ఆటల్లో రాణించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

by Aamani |
చదువుతో పాటు ఆటల్లో రాణించాలి :  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
X

దిశ,వీర్నపల్లి : విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. వీర్నపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, సామాగ్రి, స్కూల్ ఆవరణ పరిశీలించారు. అలాగే మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో భోజనం గది, కిచెన్, ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఈ రోజు మెనూలో ఏ ఆహార పదార్థాలు పెట్టారో అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ బిల్డింగ్ పైకి ఎక్కి చూశారు. శుక్రవారం రోజున పర్లపల్లి అశ్విత అనే 8వ తరగతి బాలిక పాఠశాల భవనంపై నుంచి దూకింది. దీంతో బిల్డింగ్ పైకి ఎక్కి ద్వారానికి తాళం వేయాలని, అవసరం ఉన్న చోట గ్రిల్స్ పెట్టించాలని, విద్యాలయం ఆవరణ, వీధిలో విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

వీర్నపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి వాలీబాల్ పోటీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించి, వారితో సరదాగా కాసేపు వాలి బాల్ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారు చదువుతోపాటు ఆటల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆటలు దేహదారుడ్యానికి, మనోవికాసానికి దోహదం చేస్తాయని వివరించారు.

బస్సు సమస్య తీర్చాలని వినతి పత్రం..

మండల కేంద్రంలో విద్యార్థులకు పాఠశాల సమయానికి అనుగుణంగా రావడం లేదని విద్యార్థి నాయకుడు జులపల్లి మనోజ్ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ డిపో మేనేజర్ కి ఫోన్ చేసి సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు అదనపు బస్సులు కేటాయించాలని మేనేజర్ కు తెలిపారు.ఇక్కడ డీఈవో రమేష్ కుమార్, జీసీడీఓ పద్మజ, తహసీల్దార్ మారుతి రెడ్డి ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed