సమ్మె చేస్తే ఉద్యోగాలు ఊస్ట్.. విద్యుత్ ఉద్యోగులకు యాజమాన్యాల హెచ్చరిక!

by Satheesh |
సమ్మె చేస్తే ఉద్యోగాలు ఊస్ట్.. విద్యుత్ ఉద్యోగులకు యాజమాన్యాల హెచ్చరిక!
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ యాజమాన్యాలు, ఉద్యోగులు ఢీ అంటే ఢీ అంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీజన్లు ఈనెల 25వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే విద్యుత్‌ ఆర్టీజన్లు స్పష్టం చేశారు. కాగా యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. సమ్మెలో ఎవరు పాల్గొన్నా సరే వారి జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

ఏరోజు సమ్మెలో పాల్గొంటే ఆ రోజు నుంచే వారిని ఉద్యోగాల నుంచి తీసేయాలని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఆరు నెలల పాటు విద్యుత్ సంస్థల్లో ఎలాంటి నిరసనలు, సమ్మె చేయకూడదని విద్యుత్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీనికి తోడు ఇటీవల పలు విద్యుత్ ఉద్యోగ సంఘాలతో కార్మిక శాఖ చట్టం ప్రకారం యాజమాన్యం సమ్మె, నిరసనలకు దిగబోమని ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ నేపథ్యంలో ఆర్టీజన్లు ఈనెల 25వ తేదీన సమ్మెకు పిలుపునివ్వడంతో యాజమాన్యం సమ్మెకు దిగితే ఉద్యోగాలు పోతాయని ఉత్తర్వులు జారీచేసింది. వేసవి, యాసంగి సీజన్ నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు యాజమాన్యాలు స్పష్టంచేశాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రతి ఉద్యోగిపై ఉందని యాజమాన్యాలు సూచించాయి. కావున విద్యుత్ సిబ్బంది ఎలాంటి సమ్మెలో పాల్గొనకూడదని, లేదంటే ఉద్యోగాలు పోవడం ఖాయమని సంస్థలు హెచ్చరికలు జారీచేశాయి.

Advertisement

Next Story

Most Viewed