కివీస్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు లెజెండరీ క్రికెటర్ల పేరు

by Harish |
కివీస్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు లెజెండరీ క్రికెటర్ల పేరు
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌ను క్రో-థోర్ప్ ట్రోఫీ‌గా మార్చారు. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం మార్టిన్ క్రో, ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్ గ్రహం థోర్ప్‌ల గౌరవార్థం ఈ సిరీస్‌కు వారి పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం వెల్లడించింది. ఇక, ఇరు జట్ల మధ్య జరిగే సిరీస్‌లో విజేతకు క్రో-థోర్ప్ ట్రోఫీ అందజేయనున్నారు. ట్రోఫీని ఇద్దరు దిగ్గజాలు ఉపయోగించిన బ్యాట్ల నుంచి తీసుకున్న కలపతో తయారు చేయడం విశేషం.

1930లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సిరీస్ జరిగింది. మార్టిన్ క్రో, గ్రహమ్ థోర్ప్ క్రికెట్‌లో దిగ్గజాలుగా గుర్తింపు పొందారు. 1982-95 మధ్య కివీస్‌కు ఆడిన క్రో 77 టెస్టుల్లో 5,444 రన్స్ చేశాడు. అందులో 17 శతకాలు ఉన్నాయి. అలాగే, 1993-2005 మధ్య ఇంగ్లాండ్‌కు ఆడిన థోర్ప్ 100 టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 6,744 పరుగులు చేశాడు. 2016లో క్రో మరణించగా.. థోర్ప్ ఈ ఏడాది ఆగస్టులో కన్నుమూశారు.

ఇద్దరు దిగ్గజాలు క్రికెట్‌కు చేసిన సేవలకుగానూ కివీస్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు వారి పేర్లు పెట్టారు. ఈ నెల 28 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. కివీస్ ఆతిథ్యమిస్తున్నది. తొలి టెస్టుకు ముందు క్రో సోదరి డెబ్ క్రో, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ ట్రోఫీని అధికారికంగా ఆవిష్కరిస్తారు.

Advertisement

Next Story