- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ లెటర్ రాసిన కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్: జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఓపెన్ లెటర్(open letter) రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నియంతృత్వ ధోరణి వదిలి, ప్రజాస్వామికంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. పరిపాలన సాగించాలని.. లేకుంటే రేవంత్‌కి, కాంగ్రెస్ పార్టీ(Congress party)కి ప్రజలు బుద్ధి చెబుతారని తాను రాసిన ఓపేన్ లేటర్‌లో కేటీఆర్ హితవు పలికారు.
కాగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన ఓపెన్ లేటర్‌లో.. "జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ ఓపెన్ లెటర్ ద్వారా తెలంగాణలో మీ రాజ్యాంగ వ్యతిరేక పాలనను తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాను. మీ పాలన ప్రజల హక్కులను తొక్కేస్తూ, రాష్ట్ర ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగిస్తోంది. ఒకవైపు మీ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని రాజ్యాంగ విలువలను కాపాడుతామని చెబుతారు. కానీ.. మీ ప్రభుత్వం అన్ని రాజ్యాంగ ప్రమాణాలను, విలువలను స్ఫూర్తిని పూర్తిగా ఉల్లంఘిస్తుంది. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి గౌరవ సూచకంగా కేసిఆర్ ప్రభుత్వం అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా సాధ్యమవ్వడంతో.. ప్రతి తెలంగాణ పౌరుడు అంబేద్కర్ గారికి రుణపడి ఉంటారు. అయితే, కేసిఆర్ గారిపై మీకున్న వ్యక్తిగత వ్యతిరేకత వల్ల మీరు ఆ విగ్రహానికి ఒక్కసారైనా గౌరవించకపోవడం చూసి చాలా బాధ కలుగుతోంది. ఇది భారత రాజ్యాంగ రూపకర్తకు నేరుగా మీరు చేస్తున్న అవమానం అని గుర్తుంచుకోవాలి.
మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. దొడ్డి దారిన మా పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి చేర్చుకోవడమే కాకుండా.. యాంటీ-డిఫెక్షన్ చట్టాన్ని విస్మరించి, బీఆర్ఎస్ నుండి చట్ట వ్యతిరేకంగా వచ్చిన ఎమ్మెల్యేలకు మీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ఇస్తోంది. భారత రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కుల్లో ప్రసంగ స్వేచ్ఛ (ఆర్టికల్ 19(1)(ఎ)) కీలకమైనది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హక్కును తొక్కి పెట్టడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ప్రజా పాలన పేరుతో మీరు అరాచక పాలనను అమలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం తప్పులను ప్రశ్నించే వారిపైన, చివరికి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినా సరే, వారిపై తప్పుడు కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. మీ పాలనను వ్యతిరేకించే పోస్టులకు సంబంధించి గ్యాంగ్‌స్టర్, దేశద్రోహం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ప్రెస్ స్వేచ్ఛ వాక్ స్వాతంత్రంలో కీలకమైనది, తెలంగాణలో ఇది కూడా దాడులకు గురవుతోంది. మీడియా ప్రతినిధులపై శారీరక దాడులు, తప్పుడు కేసులు నమోదు చేయడం మీ ప్రభుత్వం అరాచక తత్వాన్ని బహిర్గతం చేస్తోంది.
మీ 11 నెలల పాలనలో పోలీసుల వేధింపులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. గత 11 నెలల మీ పాలనలో బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని మానసిక, శారీరక వేధింపులకు గురిచేసిన అనేక ఘటనలు వెలుగు చూశాయి. మీ పాలన కింద తెలంగాణ ఒక పోలీస్ రాజ్యంగా మారింది. ఇంతటితో ఆగకుండా, మీ కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాల వలన సోదరులు క్విడ్ ప్రో కో విధానంలో నేరుగా లబ్ధి పొందుతున్నారు. మీ ప్రభుత్వం కింద రాజ్యాంగం ఉల్లంఘన చేస్తున్న మరో ఉదాహరణగా HYDRAA, ఇతర సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఇష్టం వచ్చిన విధంగా కూల్చివేతలు ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఈ విధమైన కూల్చివేతలను రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. మీరు ప్రజలకు “మార్పు” అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ మార్పు ఒక మోసం అని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. సమాజంలోని వివిధ వర్గాలు మీ రాజ్యాంగ వ్యతిరేక, అసమర్థ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు.
ఈ కీలకమైన జాతీయ రాజ్యాంగ దినోత్సవం రోజున, తెలంగాణలో రాజ్యాంగ పరిపాలనను పునరుద్ధరించమని మీకు తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వానికి గౌరవం చూపించేలా రాజ్యాంగ హక్కులను, స్ఫూర్తిని కాపాడుతూ ప్రజలకు పరిపాలన అందించాలని సూచిస్తున్నాను. ప్రజలు, మాలాంటి పార్టీలు పదేపదే మీ తీరు మార్చుకోని, ప్రజాస్వామికంగా వ్యవహరించాలని చేస్తున్న విజ్ఞప్తులను, డిమాండ్లను పట్టించుకోకుండా నియంతృత్వంతో, అప్రజాస్వామికంగా మీరు రాజ్యాంగ వ్యతిరేక పాలనను కొనసాగిస్తే, రాష్ట్ర ప్రజలు మీకు మరియు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు." అని కేటీఆర్ తన లేఖలో రాసుకొచ్చారు. కాగా ఈ ఓపెన్ లెటర్ పై కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.