ఉద్యోగులకు శిక్షణా సంస్థను ఏర్పాటు చేయండి.. మంత్రి పొంగులేటిని కోరిన ఉద్యోగుల జేఏసీ

by Bhoopathi Nagaiah |
ఉద్యోగులకు శిక్షణా సంస్థను ఏర్పాటు చేయండి.. మంత్రి పొంగులేటిని కోరిన ఉద్యోగుల జేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో వివిధ స్థాయిల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల ప‌రిష్కారానికి చ‌ర్యలు తీసుకోవాల‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. ఎన్నిక‌ల ప్రక్రియ‌లో భాగంగా వేరే ప్రాంతాల‌కు బ‌దిలీ అయిన త‌హ‌శీల్దార్లను, 317 జీవో ద్వారా బ‌దిలీ అయిన త‌హ‌శీల్దార్లు, ఇత‌ర రెవెన్యూ అధికారుల‌ను తిరిగి పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాలని కోరారు. రెవెన్యూ శాఖ నుంచి ఇత‌ర శాఖ‌ల‌కు స‌ర్దుబాటు చేసిన వీఆర్వోలు, వీఆర్ఏల‌ను తిరిగి రెవెన్యూ శాఖ‌లోకి తీసుకురావాలన్నారు. అన్ని స్థాయిల్లో రెవెన్యూ ఉద్యోగుల‌కు ప‌దోన్నతులు క‌ల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సీసీఎల్ఏ స‌హా అన్ని రెవెన్యూ కార్యాల‌యాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేసి, ఉద్యోగుల‌పై ప‌ని భారం త‌గ్గించాలి. త‌హ‌శీల్దార్ల అద్దె వాహ‌నాల బిల్లులు 15 రోజుల్లో వ‌చ్చేలా చూడాలి. అద్దె వాహ‌నాల‌కు చెల్లించే మొత్తాన్ని నెల‌కు రూ.33,000 నుంచి రూ.50,000 వేల‌కు పెంచాలి. చిన్న చిన్న స‌మ‌స్యల‌కు త‌హ‌శీల్దార్లు/ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌కుండా పోలీసు అధికారుల‌కు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప‌దోన్నతుల‌పై ఇత‌ర జిల్లాల్లో జూనియ‌ర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లుగా ప‌ని చేస్తున్న వారిని తిరిగి సొంత జిల్లాల‌కు బ‌దిలీ చేసేలా చ‌ర్యలు తీసుకోవాలన్నారు కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం అమ‌లు, ఇప్పుడున్న చ‌ట్టాల అమ‌లు కోసం రెవెన్యూ ఉద్యోగుల‌కు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రతి గ్రామానికి ఒక జూనియ‌ర్ రెవెన్యూ అధికారి ఉండాల‌ని కోరారు. వీఆర్వో, వీఆర్ఏల కారుణ్య నియామ‌కాలు చేప‌ట్టాలి. వీఆర్వోల‌కు సర్వీస్ ప్రొటెక్షన్, పే ప్రొటెక్షన్ కల్పించాలి. కామన్ సీనియార్టీ ద్వారా పదోన్నతులు కల్పించాలి. జీవో 81 ప్రకారం త‌క్కువ స‌మ‌యంలో ఎలాంటి బెనిఫిట్స్ పొంద‌కుండా ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న 55 ఏళ్ల నుంచి 61 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల వీఆర్ఏల వార‌సుల‌కు ఉద్యోగాలు ఇచ్చి 2500 ద‌ళిత‌ కుటుంబాల‌ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ ప్రధాన కార్యద‌ర్శి కె.రామ‌కృష్ణ, త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు ఎస్‌.రాములు, ప్రధాన కార్యద‌ర్శి ర‌మేశ్ పాక‌, వీఆర్వో అసోసియేష‌న్ అధ్యక్షుడు గ‌రికె ఉపేంద‌ర్ రావు, రాష్ట్ర వీఆర్ఏ హ‌క్కుల సాధ‌న స‌మితి చైర్మన్ ఆర్‌.విజ‌య్‌, క‌న్వీన‌ర్ కె.స‌త్యనారాయ‌ణ‌, రీడిప్లాయిడ్ వీఆర్వో అసోసియేష‌న్ అధ్యక్షుడు వింజ‌మూరి ఈశ్వర్‌, ప్రధాన కార్యద‌ర్శి కిర‌ణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ టెక్నిక‌ల్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ అధ్యక్షుడు కె.ర‌ఘు, ఎం.భూమేశ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed