Lagacharla incident: లగచర్ల ఘటనపై సమగ్ర విచారణ చేయండి

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-18 16:58:53.0  )
Lagacharla incident: లగచర్ల ఘటనపై సమగ్ర విచారణ చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి కోరారు. లగచర్ల గ్రామంలో దాడి ఘటన, తదుపరి పరిణామాలను సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌కు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ లచ్చిరెడ్డి, మిగతా నాయకులు కలిసి విషయాలను వివరించారు. లగచర్ల ఘటనలో దాడికి అసలు సూత్రధారులు వేరే ఉన్నారనే విషయాన్ని హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఈ విషయాన్ని అధికారులకు, రైతులకు మధ్య జరిగిన దాడిగా మార్చారని గుర్తుచేశారు.

ప్రజలకు, అధికారులకు మధ్య ఏనాడూ ఘర్షణ వాతావరణం ఉండదన్నారు. అధికారులు సేవకులుగా పనిచేయడం వారి బాధ్యత అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఘటనలో కొందరు గుండాలు రైతుల ముసుగులో ఉండి అధికారులపై గ్రామస్తులను ఒకవైపు ఉసిగొల్పడం, మరోవైపు దాడికి పాల్పడటం జరిగిందన్నారు. ఉద్యోగులపై ఏదో ప్రమాదవశాత్తు జరిగిన దాడి కాదన్నారు. ఇదంతా కూడా పక్కా ప్రణాళికతోనే చేశారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా సమగ్ర విచారణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డాక్టర్ జి.నిర్మల, జీఎస్ కుమారస్వామి, ఎస్.రాములు, రమేష్ పాక, దర్శన్ గౌడ్, ఫూల్ సింగ్ చౌహాన్, రాధ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed