రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు.. ముఖ్యమంత్రి హామీపై నిలదీత

by Vinod kumar |   ( Updated:2023-03-24 16:38:45.0  )
రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు.. ముఖ్యమంత్రి హామీపై నిలదీత
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేతన సవరణతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాతో విద్యుత్ సౌధ పరిసరాలు దద్దరిల్లాయి. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులంతా రోడ్డెక్కి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిలదీశారు. ఇంతకాలం సహనంతో ఉండి ఉన్నట్టుండి తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీజన్లు, విద్యుత్ ఉద్యోగులు నగరానికి తరలివచ్చారు.

వారు చేపట్టిన ధర్నాతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ధర్నాకు విద్యుత్ ఇంజినీర్లు, అకౌంట్స్ స్టాఫ్, ఆపరేషన్స్ అండ్ మేనేజ్ మెంట్ స్టాఫ్, కార్యాలయ ఉద్యోగులంతా భారీగా తరలివచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేతన సవరణతో పాటు తమకు గతంలో ఇచ్చిన హామీలపై వారంతా ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యుత్ సంస్థల్లో ఒక రంగానికి చెందిన కార్మికులకు రెండు వేరు వేరు నియమ నిబంధనలు అమలు చేయడంపై విద్యుత్ కార్మికులంతా ఒక్కటయ్యారు.

మరీ ముఖ్యంగా ఆర్టీజన్లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదని, ఇప్పటి వరకు సంస్థలో లేనటువంటి స్టాండింగ్ ఆర్డర్ చట్టాలను అమలుచేయడంతో వారికి తీరని నష్టం జరుగుతోందని వాపోయారు. విద్యుత్ సంస్థల సీఎండీలు ఆర్టీజన్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదని నినదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 23 వేల మంది కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ముందడుగు పడలేదని ఆర్టీజన్లు ధ్వజమెత్తారు.

విద్యుత్ సంస్థల్లోని కార్మికులకు సమానమైన నియమ నిబంధనలను అమలుచేయకుండా స్టాండింగ్ ఆర్డర్స్ అని వేరుగా రూల్స్ అమలుచేయడంపై ధ్వజమెత్తారు. చివరకు ఆర్టీజన్ కార్మికుడు చనిపోతే వారి కుటుంబసభ్యుల విద్యార్హతలను కూడా పరిగణలోకి తీసుకోకుండా స్వీపర్ స్థాయి ఉద్యోగాలు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నలుగురు కార్మికులు చేయాల్సిన పని గంటలను ఇద్దరు కార్మికులతో చేయించడంపై దుమ్మెత్తిపోశారు. ఇలాంటి వాటితో కార్మికులు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నారని చెబుతున్నారు.

పీఆర్సీ కూడా ఏడాదిగా అమలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని కార్మికులు వాపోయారు. గత పీఆర్సీలో ఇచ్చిన పర్సేంటేజ్ కంటే తక్కువ శాతం ఇవ్వడం వల్ల ఆర్టీజన్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా వేతన సవరణతో పాటు తమకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story