తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు: కేఏ పాల్ జోస్యం

by Satheesh |   ( Updated:2022-12-10 15:06:23.0  )
తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు: కేఏ పాల్ జోస్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతోందని చెప్పారు. మునుగోడులో గద్దర్‌పై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయన వెనక్కి తగ్గారని, గద్దర్‌ను ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారని ఆరోపించారు. శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన పాల్ ప్రజా సమస్యలు తీర్చడంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలం అయ్యారని ఆరోపించారు. ఏపీలో షర్మిల పాదయాత్ర చేసి తన అన్నను అధికారంలోకి తీసుకు వస్తే అక్కడ ప్రజా సమస్యలు తీరాయా? ఇప్పుడు తెలంగాణలో ఆమె ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు.

ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకు పోయాయన్నారు. క్యూబా లాంటి పేద దేశాల్లో ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తుంటే ఇంత గొప్ప దేశమైన భారత్‌లో ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్, హెల్త్ ఇవ్వలేకపోతున్నామని ప్రశ్నించారు. మంచినీళ్లు కూడా ఫ్రీగా ఇవ్వలేని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఓటు వేస్తే అంతకంటే దౌర్భాగ్యం లేదన్నారు. ఢిల్లీ, పంజాబ్ ప్రజలు చూపించిన మార్పును తెలుగు ప్రజలు చూపించాలన్నారు. మునుగోడులో మెజారిటీ ఓట్లు తనకే పడ్డాయని కానీ ఈవీఎంలు మార్చి టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగల్లా ఓట్లు పంచుకున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజాశాంతి పార్టీ ప్రజల్లోకి వెళ్తుందన్నారు.

Advertisement

Next Story