గురుకుల ఖాళీల భర్తీకి ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్..

by Hamsa |   ( Updated:2023-02-20 02:55:30.0  )
గురుకుల ఖాళీల భర్తీకి ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు త్వరలో నోటిఫికేషన్లు అంటూ ఊరించిన ప్రభుత్వం, అధికారులు.. నేడు ఎన్నికల కోడ్ సాకుతో మరికొద్ది రోజులు కాలయాపన చేస్తున్నారు. ఆర్థిక శాఖ అనుమతులిచ్చి ఎనిమిది నెలలు పూర్తికావస్తున్నా గురుకులాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయడంలేదు. అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో మొత్తం 11,105 ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. కాగా అందులో తొలుత 9096 పోస్టులకు 17 జూన్ 2022లో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఈ ఏడాది జనవరిలో మరో 2009 పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అయినా నోటిఫికేషన్ ఇవ్వడంలో ప్రభుత్వం తాత్సారం వహిస్తోంది.

మొన్నటి వరకు గురుకులాల్లో ఖాళీల భర్తీకి 317 జీవో అడ్డంకిగా మారిందని అధికారులు, ప్రభుత్వం యంత్రాంగం కాలం వెళ్లదీసింది. ఆపై గిరిజనుల రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో రోస్టర్ ప్రకారం భర్తీ చేయాల్సి ఉందనే అంశాలను సాకుగా చెప్పింది. కాగా తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్‌ను సాకుగా చూపిస్తూ కాలంవెళ్లదీస్తోంది. దీనిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలోని 9096 పోస్టులకు తాజాగా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన 2009 పోస్టులకు కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారని నిరుద్యోగులు భావించారు. కానీ వారికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రూపంలో సర్కార్ మరో షాకిచ్చింది. ఈ ఎన్నికల కోడ్ మార్చి 16వ తేదీ వరకు సాగనుంది. దీంతో వచ్చే నెలలోనూ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేవని సమాచారం. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని పలువురు అధికారులు చెప్పి మాటదాటవేస్తున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు.

గురుకులాల్లో ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిననాటి నుంచి నిరుద్యోగులు ప్రిపరేషన్‌లో తలమునకలై ఉన్నారు. 8 నెలల నుంచి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఇతర నోటిఫికేషన్లు వచ్చినా పూర్తిస్థాయి ప్రిపేర్ అయ్యేందుకు నిరుద్యోగులకు అవకాశం లేకుండాపోతోంది. ఈ నోటిఫికేషన్ వస్తే ప్రశాంతంగా ప్రిపేర్ అయి పరీక్ష రాయొచ్చని నిరుద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం వెంటనే పలు శాఖలకు, ఇటీవల గ్రూప్స్‌కు సైతం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలో తేల్చుకోలేక నిరుద్యోగులు సతమతమవుతున్నారు. గ్రూప్స్‌కు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన నెలలోపే నోటిఫికేషన్ వేశారు. కానీ గురుకులాలకు ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇచ్చి ఎనిమిది నెలలు పూర్తికావస్తున్నా ఇప్పటివరకు నోటిఫికేషన్ వేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గ్రూప్స్‌‌కు త్వరగా ఇచ్చి, గురుకులాల బర్తీలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

గురుకుల బోర్డ్ వైఫల్యం

ఒక పక్క టీఎస్ పీఎస్సీ వేల ఉద్యోగాలకు వెంట వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే గురుకుల బోర్డు అధికారులు మాత్రం కేవలం 11,105 ఉద్యోగాలకు రోస్టర్ జాబితా పేరుతో 8 నెలలుగా నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ సాకును చెబుతున్నారు. గురుకుల అభ్యర్థులకు ఇతర ఉద్యోగ పరీక్షలకు ప్రిపేరయ్యే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీనికి అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణం. మే లేదా జూన్ లో టీఆర్టీ వెలువడే అవకాశం ఉంది. కాబట్టి గురుకుల నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలి.

Also Read..

హైదరాబాద్ శివార్లలో అసాంఘిక కార్యకలాపాలు

Advertisement

Next Story

Most Viewed