టీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా ఈడీ చక్రబంధం

by Nagaya |
టీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా ఈడీ చక్రబంధం
X

గులాబీ అగ్ర నేతలను పద్మవ్యూహంలో బంధించేందుకు ఈడీ రెడీ అవుతున్నది. కేసీఆర్, కేటీఆర్‌లకు సన్నిహితంగా ఉంటున్న వారిపై దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాబితాను సిద్ధం చేసుకున్నది. పార్టీ ఆర్థిక మూలాలను కట్ చేయడాన్ని తొలి టార్గెట్‌గా ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. ఈ మేరకు సమగ్ర సమాచారం సేకరిస్తున్నది. విషయాన్ని పసిగట్టిన గులాబీ నేతలు వాట్సాప్‌కు బదులుగా ప్రత్యేక యాప్‌లో సంభాషణలు కొనసాగిస్తున్నారు. నేరుగా కలిసి మాట్లాడేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అల్వాల్‌లో ఈడీ ఆఫీసు ఏర్పాటు.. ఆ తర్వాత బీజేపీ ముఖ్యనేతలు చేస్తున్న కామెంట్లు ప్రస్తుత పరిణామాలకు బలం చేకూర్చుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో మంత్రి పార్థా ఛటర్జీ, మహారాష్ట్రలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీకి చెందిన రాష్ట్ర మంత్రులు, మాజీలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రి సత్యేంద్రజైన్, ఆ పార్టీకి చెందిన పలువురిపై అవినీతి ఆరోపణలు, జార్ఖండ్‌లో స్వయంగా సీఎం హేమంత్ సోరేన్‌పైన మైనింగ్ అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు.. ఇవన్నీ గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఈడీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అనే చర్చ జోరందుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ నేతలను ఈడీ టార్గెట్ చేయనుందా..? అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారా? తెలంగాణలో పాగా వేసేందుకు ఈడీ దాడులను కేంద్రం వాడుకుంటున్నదా? అందులో భాగంగా టీఆర్ఎస్ పెద్దనేతలకు సన్నిహితంగా ఉన్నవారిపైనే తొలుత గురి పెట్టిందా? పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నదా..? అనువైన సమయం కోసం వేచిచూస్తున్నదా? దాడులను గులాబీ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నదా.? ఈడీ రాడార్‌లో ఉన్న అధికార పార్టీ నేతలెవరు? అన్నది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈడీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుందని, ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టే ఉద్దేశం లేదని, చుట్టూ ఉన్న కొమ్మల్ని నరుక్కుంటూ వస్తుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఈడీ దూకుడు చూసిన తర్వాత బీజేపీయేతర పార్టీల్లో ఒకింత అలజడి మొదలైంది. టచ్ చేసి చూడు.. అంటూ మొదట్లో ఘాటుగా స్పందించిన సీఎం కేసీఆర్ ఇటీవల ఒకటి రెండు కేసులు పెడితే భయపడతామా.. లీగల్‌గా ఎదుర్కొంటాం.. అంటూ రిప్లై ఇచ్చారు.

బీజేపీలోని వివిధ స్థాయిల్లో ఉన్న నేతలు ఈడీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అధికారులు ఎప్పుడు ఏం చేస్తారనేది కూడా చెప్పేస్తున్నారు. ఈ కామెంట్లతో కొందరు టీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు సన్నిహితులుగా ఉన్నవారిపైనే ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు బీజేపీ వర్గాల సమాచారం. ఆ లిస్టులో ఎంపీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఐదారుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యే కాకపోయినా ఆ స్థాయిలో ఉన్న మరో నగర నివాసి కూడా ఈడీ టార్గెట్ జాబితాలో ఉన్నారని సమాచారం. అధికార పార్టీకి చెందిన చాలామంది పూర్తి జాబితాలో ఉన్నా తొలి ఫేజ్‌లో మాత్రం ఐదారుగురినే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసింది. ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం, ఆ తర్వాత వాటిని ధ్రువీకరించుకోవడం, తగిన ఆధారాల కోసం అధికారిక సమాచారాన్ని తెప్పించుకుని విశ్లేషించుకోవడం.. ఆ తర్వాతనే నోటీసులు లేదా సోదాలకు దిగుతారని తెలుస్తున్నది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై సీబీఐ, ఈడీలకు వ్యక్తులుగా చాలా మంది ఫిర్యాదు చేశారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఢిల్లీ వెళ్లి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త బీజేపీకి అనుకూలంగా మారిన తర్వాత ఫిర్యాదు చేసినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా సరైన సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నది. ప్రాథమికంగా నిజానిజాలను తేల్చే పనిని ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలిసింది. ఒక్కొక్కరి చిట్టా విప్పడం ఖాయమని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. వారు తెలంగాణ సమాజంలో దోషులుగా నిలబడక తప్పదని, సెంటిమెంట్‌ను రాజేసి సానుభూతి పొందాలనే టీఆర్ఎస్ ప్రయత్నాలు బెడిసికొడతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం పెరుగుతున్నాకొద్దీ సీబీఐ, ఈడీ, ఐటీ పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబానికి కేసులు, జైలు తప్పదంటూ బీజేపీ నేతలు బెదిరిస్తూ ఉంటే.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ ఘాటుగానే జవాబులు వస్తున్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ చీఫ్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అవినీతిమయం అంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఈడీ సోదాలు జరుగుతూ ఉండడం, లెక్కల్లోకి రాని భారీ నగదు స్వాధీనం కావడం, కేసులు నమోదుకావడం ఎక్కువైంది. తెలంగాణలోనూ త్వరలోనే ఈడీ దాడులు తప్పవంటూ బీజేపీ నేతలు వారం రోజులుగా స్వరం పెంచారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈడీ దాడులన్నీ కేంద్రం కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కానీ కేంద్రం మాత్రం అవేమీ పట్టించుకోవడంలేదు. చట్టం తన పని తాను చేసుకు పోతుందనే రొటీన్ డైలాగులు వదులుతున్నది.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈడీ దాడులతో ప్రతిపక్ష పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో మంత్రి పార్థా ఛటర్జీ, మహారాష్ట్రలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీకి చెందిన రాష్ట్ర మంత్రులు, మాజీలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రి సత్యేంద్రజైన్, ఆ పార్టీకి చెందిన పలువురిపై అవినీతి ఆరోపణలు, జార్ఖండ్‌లో స్వయంగా సీఎం హేమంత్ సోరేన్‌పైన మైనింగ్ అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు.. ఇవన్నీ ఇటీవలే చోటుచేసుకున్నాయి. దానికి కొనసాగింపు తెలంగాణ రాష్ట్రమే అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా, విపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతున్నదని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని టీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉన్నది. ఈడీ అధికారుల దగ్గర ఉన్న టీఆర్ఎస్ నేతల జాబితాలో ఉన్నవారి పేర్లు బయటికి పొక్కకపోవడంతో టీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది.

'ఈడీ ఫియర్'తో ఫోన్లలో మాట్లాడడానికి కూడా సాహసించడంలేదు. ఇంతకాలం వాట్సాప్‌లో మాట్లాడుకుంటే సేఫ్ అనే అభిప్రాయం ఉన్నా తాజా ఈడీ దూకుడును చూసిన తర్వాత ఆ యాప్‌ వినియోగంపైనా అనుమానాలు మొదలయ్యాయి. సెక్యూరిటీ ఉండే మొబైల్ యాప్ మాత్రమే శ్రేయస్కరం అనుకుని కొన్నింటిని మాత్రమే వాడుతున్నట్లు ఓపెన్‌గానే టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. వీలైనంత వరకు ఫోన్ సంభాషణలను కూడా పరిమితం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణ జరగడం ఖాయమని కొద్ది రోజులుగా బీజేపీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గత నెల జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అంతకు ముందు మే నెల 26న ప్రధాని మోడీ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయమైందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర నేతలు మరో అడుగు ముందుకేసి ఈ అవినీతిని దర్యాప్తు సంస్థలు కక్కించడం ఖాయమని, దోషులను జైల్లో పెట్టడమూ అంతే ఖరారు అని వ్యాఖ్యానించారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు మూడు రోజుల క్రితం ఈడీ దాడులు తప్పవంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మరింత దూకుడుతో ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనంటూ కామెంట్ చేశారు. అసలే భయంతో ఉన్న కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు ఇలాంటి కామెంట్లతో మరింత డైలమాలో పడ్డారు. రైడ్స్ తప్పవనే కంక్లూజన్‌కు వచ్చారు. పలు రాష్ట్రాల్లో ఈడీ చేస్తున్న దాడులను కళ్లారా చూడడంతో ముందు జాగ్రత్త చర్యల్లో పడ్డారని సమాచారం. ఈ దాడులతో రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ఆ తర్వాత టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మల్చుకునే అవకాశాలపైనా బీజేపీ అంచనాలు వేసుకుంటున్నది. ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టడానికి బదులుగా చుట్టూ ఉన్న సన్నిహితులతో మొదలుపెట్టి చివరకు టార్గెట్ రీచ్ అయ్యే వ్యూహాన్ని అమలుచేయాలనుకుంటున్నది. కేసీఆర్, కేటీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ఆ వ్యక్తులెవరు, ఈడీ జాబితాలో ఉన్నవారెవరు, ఎలాంటి పరిస్థితుల్లో రంగంలోకి దిగుతారు..? ఇప్పుడే ఇవే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో జరుగుతున్న చర్చ.

Advertisement

Next Story

Most Viewed