ఒకే ఏడాది ‘డబుల్’ వసూల్! రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం

by Sathputhe Rajesh |
ఒకే ఏడాది ‘డబుల్’ వసూల్! రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం
X

దిశ, వైరా :" ఏ మున్సిపాలిటీలో ఐనా షాపులకు లైసెన్స్ రెన్యువల్ ఫీజు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వసూలు చేస్తారు. వసూలు చేసిన ఫీజు వివరాలను రికార్డుల్లో తప్పనిసరిగా పొందుపరుస్తారు. అయితే వైరా మున్సిపాలిటీలో మాత్రం షాపుల లైసెన్స్ రెన్యువల్ ఫీజు సంవత్సరానికి ఎన్నిసార్లు అయినా వసూలు చేస్తారు. అసలు ఈ మున్సిపాలిటీలో ఫీజులు చెల్లించిన షాపుల వివరాలు అప్డేషన్ ఉండదంటే నమ్ముతారా.. ఇది నిజమండి బాబు.. సంవత్సరానికి రెండు సార్లు లైసెన్స్ ఫీజులు వసూలు చేయడమే కాకుండా ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగటం ఇక్కడ అధికారులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది".

మొదటిసారి వసూలు చేసిన లైసెన్స్ ఫీజు నగదు ఎవరు నొక్కేసారో కూడా ఇక్కడ తెలియని పరిస్థితి నెలకొంది. అసలు మున్సిపాలిటీలో వర్జినల్ బిల్లులతోనే బిల్ కలెక్టర్లు పన్నులు వసూలు చేస్తున్నారా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోమవారం (వైరా)గ్రామపంచాయతీ సమయంలో నకిలీ బిల్లులతో పన్నులు వసూలు చేసిన ఘనత ఇక్కడ ఉంది. ప్రస్తుతం అదే తరహాలో ఏమైనా నకిలీ వ్యవహారాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకే సంవత్సరానికి రెండుసార్లు...

వైరాలోని పాత బస్టాండ్ సమీపంలో మాచర్ల యోగానంద రావు శ్రీ సాయి కృష్ణ రెడీమేడ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అయన ఓ టీవీలో నియోజకవర్గ రిపోర్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయన షాపునకు సంబంధించి 2020 - 2021 సంవత్సరానికి లైసెన్స్ ఫీజును మున్సిపాలిటీ సిబ్బంది ముక్కు పిండి రెండు సార్లు వసూలు చేశారు. 15- 5-2020 నాడు 020011493 బిల్లు నెంబర్‌పై అప్పటి బిల్ కలెక్టర్ ఏవీఎస్ రెడ్డి రూ.1000 లైసెన్స్ రెన్యువల్ ఫీజు కట్టించుకున్నారు.

అయితే ఇదే సంవత్సరానికి లైసెన్స్ ఫీజు చెల్లించలేదని 2022లో బిల్ కలెక్టర్ జానీ రెండోసారి నగదు వసూలు చేశారు. గతంలో నగదు చెల్లించిన 2020-2021 సంవత్సరానికి షాపు లైసెన్స్ రెన్యువల్ ఫీజు రూ.1000 రెండోసారి 26- 3 -2022 న 020017690 బిల్లు నెంబర్‌పై బిల్ కలెక్టర్ జానీ నగదు వసూలు చేశారు. ఇలా వైరాలో బహిర్గతం కానీ అనేక డబుల్ పన్నుల వసూళ్లకు పాల్పడినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

డబుల్ వసూల్ ఎందుకు?

ఒక సంవత్సరానికి రెండు సార్లు లైసెన్స్ ఫీజు వసూలు చేయటం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలో పన్ను రసీదులు అప్డేషన్ రికార్డ్ నిర్వహణ సక్రమంగా లేదనే ఆరోపణలు ఉన్నాయి. లేదంటే బిల్ కలెక్టర్లు ఏమైనా నకిలీ బిల్లులు తయారు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బిల్ కలెక్టర్‌గా పని చేసిన ఏవీఎస్ రెడ్డి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని చివరకు తనపై చర్యలు ఉంటాయని తెలుసుకొని తనంతట తానే ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్లారు. సోమవారం గ్రామపంచాయతీలో నకిలీ బిల్లుల వ్యవహారం చర్చకు వచ్చింది.

ఈ వ్యవహారంలో ఏవీఎస్ రెడ్డి కూడా భాగ్యస్వామ్యలై ఉన్నారని అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సోమవారం గ్రామపంచాయతీలో వసూలు చేసిన పన్నుల్లో లక్షలాది రూపాయలు ఆయన ఎగనామం పెట్టారని ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తి 2020లో వసూలు చేసిన లైసెన్స్ రెన్యువల్ ఫీజు మున్సిపాలిటీ రికార్డులో అప్డేట్ కాకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైరాలో డబ్బులు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story