Minister Sridhar Babu:‘వారి మాటలు నమ్మొద్దు’.. దశలవారీగా నిధులు విడుదల చేస్తాం: మంత్రి కీలక హామీ

by Jakkula Mamatha |
Minister Sridhar Babu:‘వారి మాటలు నమ్మొద్దు’.. దశలవారీగా నిధులు విడుదల చేస్తాం: మంత్రి కీలక హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్పంచ్‌ల ఆత్మహత్యలకు బీఆర్ఎస్సే కారణమని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లించకుండా సర్పంచులను రోడ్ల మీదకు తెచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలు ఇప్పుడు వారి ముందుండి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. గురువారం మీడియా ప్రకటనలపై బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. చిన్న చిన్న పనులకు స్థానిక కాంట్రాక్టర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్పంచులే ముందుండి చేశారన్నారు. వారికి చెల్లించవలసిన దాదాపు రూ.1300 కోట్లను దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వారి తరపున వకాల్తా పుచ్చుకుని దొంగ సానుభూతి కనబరుస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు అని ధ్వజమెత్తారు. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చి పనులు పూర్తి చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30 నెలలు బిల్లుల చెల్లింపులను పెండింగులో పెట్టిందని ధ్వజమెత్తారు.

దీంతో వడ్డీలు పెరిగి అప్పులు తీర్చే మార్గం లేక 60 మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడింది నిజం కాదా? అని నిలదీశారు. మరో 200 మంది ఆత్మహత్యాయత్నం చేశారని అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆందోళన చేస్తున్న సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలిపితే రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని శోకాలు పెట్టిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. ఇంత అవకాశవాదమా అని నిలదీశారు. కొంత మంది సర్పంచులు ఇంట్లోని మహిళలు బంగారం అమ్మి వడ్డీలు కట్టినట్టు వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన సర్పంచులకు గులాబీ పార్టీ ఇచ్చిన బహుమతి ఇదా? అని నిలదీశారు. సర్పంచులకు రావలసిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా నిధులు విడుదల చేస్తుందని వెల్లడించారు. మాజీ సర్పంచులు ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారి మాటలు నమ్మొద్దని, ధర్నాలు, ఆందోళనలు చేయవద్దని కోరారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed