Musharraf Faruqui: ట్రాన్స్ మిషన్ వ్యవస్థను మెరుగుపరచండి.. అధికారులకు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ దిశానిర్దేశం

by Maddikunta Saikiran |
Musharraf Faruqui: ట్రాన్స్ మిషన్ వ్యవస్థను మెరుగుపరచండి.. అధికారులకు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న వేసవిలో ఏర్పడే అధిక విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా పంపిణీ, ట్రాన్స్ మిషన్ వ్యవస్థను మెరుగుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(TGSPDCL Chairman&MD) ముషారఫ్‌ ఫరూఖీ(Musharraf Faruqui) అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ వ్యవస్థ పనితీరుపై ట్రాన్స్ కో , ఎస్పీడీసీఎల్ అధికారులతో మింట్ కాంపౌండ్(Mint Compound)లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ట్రాన్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ఇతర ఇంజినీర్లతో ముషారఫ్ ఫరూఖీ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ లో వేసవిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోందని, గతేడాది 3,756 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్ ఈ ఏడాది దాదాపు 16 శాతం వృద్ధితో 4,352 మెగావాట్లుగా నమోదైందని సీఎండీ వివరించారు. గతేడాది 81.39 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం దాదాపు 12 వాతం % వృద్ధితో 90.68 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు. 2025 వేసవిలో సైతం విద్యుత్ డిమాండ్ గతం కంటే రికార్డు స్థాయిలో దాదాపు 20 నుంచి 25 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు.

గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన నెమలి నగర్, గోపన్ పల్లి, కోకాపేట్, కోహెడ, తట్టి అన్నారం, అబ్దుల్లాపూర్ మెట్, మాన్సాన్ పల్లి, అజిజ్ నగర్, కందుకూరు, కే సింగారం, మల్లాపూర్, వాయుపురి, ఉప్పల్ భగాయత్, దుండిగల్ వంటి ప్రాంతాల్లో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందన్నారు. ఆ ప్రాంతాల్లో అవసరానికి తగ్గట్టు 220, 132, 33 కేవీ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సీఎండీ స్పష్టంచేశారు. ప్రస్తుతం చేపడుతున్న నిర్వహణ మరమ్మతు పనులను నాణ్యత ప్రాణాలు పాటిస్తూ నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని, నిర్వహణ పనుల కోసం తీసుకుంటున్న లైన్ క్లియరెన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ నర్సింహులు, చీఫ్ ఇంజినీర్లు రాంజీ, చక్రపాణి, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story