ఈనెల 28 నుంచి జిల్లాల పర్యటనలు.. గవర్నర్‌కు వివరించిన బీసీ కమిషన్

by Shiva |
ఈనెల 28 నుంచి జిల్లాల పర్యటనలు.. గవర్నర్‌కు వివరించిన బీసీ కమిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన ప్రక్రియలో భాగంగా స్టేట్ బీసీ కమిషన్ సైతం జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనుంది. కుల, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు వివిధ సెక్షన్ల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించే విధంగా ఈనెల 28 నుంచి వచ్చే నెల 8 వరకు అన్ని జిల్లాల్లో సమావేశాలను నిర్వహించనుంది. కుల గణనతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన కసరత్తు గురించి చైర్మన్ నిరంజన్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ను ఖరారు చేయడానికి ఆ సామాజికవర్గాల ఓటర్ల వివరాలతో పాటు రాజకీయ వెనకబాటుతనంపై కూడా అధ్యయనం చేయాల్సి ఉందని, సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను చేపట్టనున్నామని గవర్నర్‌కు వివరించారు. అన్ని కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమగ్ర సర్వే షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మకు వివరించినట్లు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ మీడియాకు తెలిపారు. కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, సమగ్రంగా సేకరించిన కులాల వివరాలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈనెల 28 నుంచి వచ్చె నెల 8 వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కులాల వారీగా సమగ్రంగా వివరాలు సేకరిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed