కొత్త సెక్రటేరియట్‌పై మంత్రులు, అధికారుల అసంతృప్తి!

by GSrikanth |
కొత్త సెక్రటేరియట్‌పై మంత్రులు, అధికారుల అసంతృప్తి!
X

కొత్త సెక్రటేరియట్‌పై పలువురు మంత్రులు, అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బయటి నుంచి హుందాగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం అలా లేదని, కారిడార్ కంటే చాంబర్లు చిన్నగా ఉన్నాయని అసహనం చెందుతున్నారు. వీటి కన్నా పాత సెక్రటేరియట్‌లోని తన చాంబర్లే నయమని కామెంట్ చేస్తున్నట్టు సమాచారం. తమకు అలాట్ అయ్యే చాంబర్లను పరిశీలించిన కొందరు.. అవి తమకు సరిపోవని, వాస్తుకు లేవని చెబుతూ వాటిని మార్చుకునేందుకు పైరవీలు మొదలు పెట్టినట్టు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై మంత్రులు, ఐఏఎస్ అధికారులు పెదవి విరుస్తున్నారు. బయటి నుంచి చూడ్డానికి హుందాగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం అలా లేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇరుకైన చాంబర్లు, చిన్న క్యాంబిన్లను నిర్మించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొత్త సెక్రటేరియట్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోపే కొన్ని కీలక శాఖలను అక్కడికి షిప్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సెక్రటేరియట్‌లో తమకు కేటాయించిన చాంబర్లు, పెషీలను చూసి మంత్రులు, ఐఏఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సీఎం చాంబర్ మాత్రమే విశాలంగా..

కొత్త సెక్రటేరియట్‌లోని 6వ అంతస్తులో సీఎం కోసం చాంబర్ ఏర్పాటు చేశారు. అది మాత్రమే విశాలంగా ఉన్నది. కాన్ఫరెన్స్ హాల్, విజిటర్ హాల్, రెస్ట్ రూమ్ ఇలా ప్రతి ఒక్కటి ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. సీఎం చాంబర్ చుట్టూ ఉండే డోర్లు, కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు అమర్చారు. కానీ ఆయన పెషీ‌లో పనిచేసే సెక్రటరీల్లో ఒక్కొక్కరికి ఒక్కో తీరుగా చాంబర్లు ఇచ్చినట్టు తెలుస్తున్నది. కానీ ప్రతి ఫ్లోర్‌లో కారిడర్ విశాలంగా, చాంబర్లు, క్యాబిన్లు చిన్నవిగా, ఇరుకుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ‘ప్యూచర్‌లో ఒక మూల నుంచి మరో మూలకు అధికారులు, స్టాఫ్ వెళ్లేందుకు ఎలక్ట్రికల్ వెహికల్ ఏర్పాటు చేస్తారు. అందుకే కారిడర్ పెద్దగా ఉండేలా డిజైన్ చేశారు.’ అని ఓ మంత్రి పేర్కొన్నారు.

అలకలు, ఆగ్రహాలు

తనకు కేటాయించిన చాంబర్ చూసి ఓ సీఎంఓ సెక్రటరీ షాక్ అయిన్టట్టు సమాచారం. చాంబర్ చాలా చిన్నదిగా ఉన్నదని, తనకు, తన పెషీ స్టాఫ్‌కు కలిపి ఒకే ఎంట్రీ ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొత్త సెక్రటేరియట్ కంటే పాత సెక్రటేరియట్‌లోని చాంబర్ చాలా బాగుండేదని కామెంట్ చేసినట్టు సమాచారం. తనకు కేటాయించిన చాంబర్‌లో మార్పులు చేర్పుల కోసం సదరు ఐఏఎస్.. ఆర్ అండ్ బీ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి వద్ద పైరవీ చేస్తున్నట్టు టాక్. ఇక తన చాంబర్ విషయంలో ఓ సలహాదారుడు ఆర్ అండ్ బీ అధికారులపై సీరియస్ అయినట్టు సమాచారం. పాత సెక్రటేరియట్‌లో తన చాంబర్ నుంచి హుస్సేన్‌సాగర్ వ్యూ కనిపించేందని, ఇక్కడ అలా ఎందుకు లేదని ఫైర్ అయినట్టు తెలిసింది ‘పెషీలో పనిచేసే స్టాప్‌కు సాగర్ వ్యూ ఉంది, నాకు ఎందుకు లేదు. వ్యూ కనిపించేలా నా చాంబర్‌ను ఏర్పాటు చేయండి.’ అని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని ఆర్ అండీ బీ అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. గత వారం సీఎం దగ్గర పనిచేసే ఓ పీఆర్వో కొత్త సెక్రటేరియట్‌లోకి వెళ్లి, తనకు కేటాయించిన రూమ్‌ను పరిశీలించారు. రూమ్ చాలా చిన్నదిగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రూమ్‌లో బాత్ రూమ్ నిర్మించలేదని ప్రశ్నించినట్టు సమాచారం. తన రూమ్‌లో వెంటనే బాత్ రూమ్ ఏర్పాటు చేయాలని అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న సైట్ ఇంజినీర్‌ను ఆదేశించినట్టు టాక్.

వాస్తు పేరుతో చాంబర్ మార్పునకు మంత్రి పైరవీ

సెక్రటేరియట్‌లో తనకు కేటాయించిన చాంబర్ విషయాన్ని ఓ మంత్రి ఆరా తీశారు. ఐదో అంతస్తులో అలాట్ చేస్తారని అక్కడున్న అధికారులు చెప్పడంతో.. సదరు మంత్రి.. ఆ మూల చాంబర్ తన జన్మ నక్షత్రం ప్రకారం ఎలా ఉంటుందని వాస్తు నిపుణుల సలహాలు తీసుకున్నట్టు టాక్. వారు వద్దని సూచించడంతో ఆ మూలనున్న చాంబర్ తనకు అలాట్ కాకుండా పైరవీ మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story