ఇక రాజీపడే ప్రసక్తే లేదు.. ఆ విషయంలో తెలంగాణ డీజీపీ సీరియస్

by Gantepaka Srikanth |
ఇక రాజీపడే ప్రసక్తే లేదు.. ఆ విషయంలో తెలంగాణ డీజీపీ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకుంటున్న నిరసనలు, ఆందోళనలు, వాటి కారణంగా తలెత్తిన పరిణామాలపై డీజీపీ జితేందర్ సీరియస్‌గా స్పందించారు. రాజకీయంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం, ఆందోళనల పేరుతో రోడ్డెక్కడం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ప్రాంతీయ విద్వేషాలకు తావిచ్చేలా స్టేట్‌మెంట్లు ఇవ్వడం, పోలీసు స్టేషన్ల ముందు దర్నాలు, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని బెదిరించే తీరులో వ్యవహరించడం... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న డీజీపీ... ముగ్గురు పోలీసు కమిషనర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. లా అండ్ ఆర్డర్ నియంత్రణ విషయంలో విఘాతం కలిగించే వ్యక్తులు, శక్తులపై ‘జీరో టాలరెన్స్’ తరహాలో పోలీసు అధికారులు పనిచేయాలని నొక్కిచెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.

ఒకవైపు గణేశ్ నిమజ్జనానికి విస్తృత స్థాయిలో చేపడుతున్న ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా దాదాపు పాతిక వేల మంది పోలీసులను నియమించడం, అసాంఘిక చర్యలకు తావు లేకుండా విజిబుల్ పోలీసింగ్, ఘర్షణలు చోటుచేసుకోకుండా పకడ్బందీ బందోబస్తు చేపడుతున్న సమయంలోనే రాజకీయ నాయకుల నిరసనలు, ఆందోళనతో ప్రజలకు ఇబ్బంది తలెత్తడం, శాంతభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఉత్పన్నం కావడాన్ని ముగ్గురు పోలీసు కమిషనర్లతో డీజీపీ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17న ప్రజాపాలనా దినోత్సవం నిర్వహిస్తున్నందున, ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నందున చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్ల సమయంలో రాజకీయంగా పోటీపోటీ ప్రదర్శనలు, ఆందోళనలు చోటుచేసుకోవడాన్ని డీజీపీ సీరియస్‌గా తీసుకున్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకుండా పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరిస్తూనే ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వ కార్యక్రమాలకు, గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడడం పోలీసు శాఖ బాధ్యత అని నొక్కిచెప్పారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్2ను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని స్పష్టం చేసిన డీజీపీ... ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని అప్పీల్ చేశారు.

Advertisement

Next Story