జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు

by Satheesh |
జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరిక వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరిక విషయంలో జీవన్ రెడ్డి అసంతృప్తిని పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారని, పార్టీలో ఆయన సీనియారిటీకి భంగం కలిగించమన్నారు. పార్టీలో జీవన్ రెడ్డి తగిన గౌరవం ఇస్తామని చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరిక ఇష్యూపై అందరం కలిసి చర్చిస్తామన్నారు. కాగా, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సొంత నియోజకవర్గంలో చేరిక గురించి కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకపోవడంపై జీవన్ రెడ్డి అలకబూనారు. ఈ క్రమంలోనే ఆయనను బుజ్జిగించేందుకు భట్టి, శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు.

Advertisement

Next Story