అవినీతికి అడ్డాగా ప్రభుత్వ కార్యాలయం.. ప్రతి పనికి డబ్బులు గుంజుడే !

by srinivas |   ( Updated:2024-07-08 03:07:40.0  )
అవినీతికి అడ్డాగా ప్రభుత్వ కార్యాలయం.. ప్రతి పనికి డబ్బులు గుంజుడే !
X

దిశ, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికీ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి చేతులు తడపనిదే ఏ పని కూడా చేయడం లేదని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత శుక్రవారం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఇంజినీరింగ్ సెక్షన్ విభాగం ఏఈ బలవంత రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. బల్వంత్ రెడ్డి తన కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటూ చిక్కడం గమనార్హం. ఈ విషయం రంగారెడ్డి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఎక్కడ చూసినా ఇదే అంశాన్ని మాట్లాడుకున్నారు.

ఔట్ సోర్సింగ్‌దే హవా..

రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది అన్ని వ్యవహారాలు చక్కదిద్దుతున్నారని ప్రజలతో పాటు ఆయా శాఖల అధికారులు గుసగుసలాడుతున్నారు. సర్కిల్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులు వారిని అన్ని విధాలుగా వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్ కార్యాలయంలోని అన్ని విభాగాలు అవినీతిలో మునిగిపోయాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన జీహెచ్ఎంసీ సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇంటి నంబర్లలో గోల్ మాల్..

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్లలో ఇంటి నంబర్ కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ విషయంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. పాత ఇళ్లకు కూడా ఇలా నంబర్లను అధికారులు తమ ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నారని చెబుతున్నారు. దాంతోపాటు కార్యాలయంలోని ఆయా శాఖల అధికారులు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలుస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed