సొంత ప్రయోజనాల కోసం టీచర్ల సమస్యలు తాకట్టు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

by Vinod kumar |
సొంత ప్రయోజనాల కోసం టీచర్ల సమస్యలు తాకట్టు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ఎన్నికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల సొంత ప్రయోజనాల కోసం ఉపాధ్యాయుల సమస్యలను తాకట్టు పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఎస్టీయూ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భుజంగరావు కు ఉపాధ్యాయ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని, ఉపాధ్యాయుల గొంతు శాసనమండలిలో ప్రతి ధ్వనించాలంటే ఆయనను గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

సమస్యల పై నిర్భయంగా, నిక్కచ్చిగా ప్రశ్నించే ధైర్య సాహసాలు కలిగిన భుజంగరావు ను గెలిపిస్తే శాసనమండలిలో ఉపాధ్యాయుల సమస్యల పై పోరాడి పరిష్కారానికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎస్టీయూ అధ్యాపకుల సంఘాల అభ్యర్ధిగా బి. భుజంగరావు మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. భుజంగరావు అభ్యర్థిత్వానికి మద్దతుగా హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి వీఎస్టీ ఫంక్షన్ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభలో ముఖ్య అతిథిగా కూనంనేని హాజరై భుజంగరావు అభ్యర్ధిత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. విద్యారంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న భుజంగరావు ను టీచర్స్ ఎమ్మెల్సీ గా గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే సమాజ అభ్యున్నతి కోసం పాటుపడతారని తెలిపారు. కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed