BRS, బీజేపీని దెబ్బతీసేలా స్కెచ్.. ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ ఎత్తుగడలు!

by Rajesh |
BRS, బీజేపీని దెబ్బతీసేలా స్కెచ్.. ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ ఎత్తుగడలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది బీఆర్ఎస్‌కు షాక్‌కు గురి చేయగా.. రాష్ట్రంలో ‘ఆపరేషన్ కాంగ్రెస్’ స్టార్ట్ అయినట్లు స్పష్టమవుతోంది. పోచా రంతో కొన్ని రోజులుగా టీపీసీసీ కీలక నేతలు సీక్రెట్‌గా చర్చలు జరిపారు. పలు దఫాలు డిస్కషన్స్ అనంతరం శుక్రవారం ఆయన కుమారుడితో కలిసి సీఎం సమక్షంలో ‘హస్తం’ కండువా కప్పుకున్నారు. దీంతో ఇంకెంత మంది చేజారిపోతారోనని బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైంది. చాలా మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల కంటే ముందే సీఎం సమక్షంలోనే కమిట్‌‌మెంట్ అయినట్లు తెలిసింది. ఇప్పుడు ఆయా నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

గత టీడీపీలోని నేతలకు గాలం

సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో గతంలో టీడీపీలో పని చేసిన సీనియర్ లీడర్లతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి కొందరు నేతలు పాజిటివ్‌గా స్పందించారని సమాచారం. దీంతో కంటిన్యూగా చేరికలు ఉంటాయని సీఎం సన్నిహిత వ్యక్తుల్లో ఒకరు తెలిపారు. 2014, 2018లో టీడీపీ బీ ఫామ్‌పై గెలిచి, ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన లీడర్లందరినీ కాంగ్రెస్ లోకి తీసుకోవాలని సీఎం స్వయంగా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీని జీరో చేయాలనే లక్ష్యంతో తన వ్యూహాలను ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పా‌టు గతంలో టీడీపీలో పనిచేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి లాంటి నేతలను సైతం కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎర్రబెల్లి సైతం పార్టీలో చేరుతున్నారంటూ గాంధీభవన్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి స‌మాచారం రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థుల ఊహకందని విధంగా స్ట్రాటజీని అమలు చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

స్పీడప్‌కు కారణమిదేనా!

రాష్ట్రంలో బీఆర్ఎస్ పవర్ కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవాలని భావించారు. ఇందుకోసం సీఎం అండ్ టీమ్‌తోనూ చర్చలు జరిపారు. ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లు కండువాలు కప్పుకున్నారు. మిగతా ఎమ్మెల్యేల చేరికలను కాంగ్రెస్ హోల్డ్‌లో పెట్టగా, ఇంకొంత మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ ఫలితాలు తర్వాత పార్టీ మార్పుపై ఆలోచించాలని భావించారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాకపోవడంతో ఆ పార్టీలో ఉన్న నేతలు ‘పవర్ పార్టీ’ వైపు అడుగులు వేయాలని ఆలోచిస్తున్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది సీట్ల చొప్పున గెలుపొందాయి. దీంతో కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉన్నదని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందుకు సెంట్రల్‌లో బీజేపీ పవర్‌లోకి రావడమే కారణమని చెప్తున్నారు. పైగా కాంగ్రెస్ గతంలో కొందరి చే‌రికలకు ఆబ్జెక్షన్ పెట్టింది. ఇప్పుడు ఈ నేతలంతా బీజేపీకి వెళ్లిపోతే రాష్ట్రంలో ఆ పార్టీ మరింత బలంగా మారుతుందనే టెన్షన్ కాంగ్రెస్‌లో మొదలైంది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతామని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకే జాయినింగ్స్‌ను స్పీడప్ చేసినట్లు కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత తెలిపారు.

ప్రతిపక్ష హోదా చేజారేలా..

అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ తన వ్యూహాలను అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. 2014, 2018లో బీఆర్ఎస్ అనుసరించిన విధానాలతోనే ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్లు చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 2/3 వంతు (26 మంది) ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని ప్లాన్ చేస్తున్నది. ఈ అంశాన్నీ సీఎం రేవంత్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. పదేళ్లపాటు పవ ర్‌లో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు, లీడర్లను పెట్టిన ఇబ్బందులను ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు చూపించాలని సీఎం తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.

Advertisement

Next Story