కేటీఆర్ సోయి ఉండే మాట్లాడుతున్నారా..? మాజీ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్

by Satheesh |
కేటీఆర్ సోయి ఉండే మాట్లాడుతున్నారా..? మాజీ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కరించకుంటే వారి తరపున మేము గొంతు విప్పుతామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కేటీఆర్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ సిద్దేశ్వర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, కేటీఆర్ సోయి ఉండే ఆ వ్యాఖ్యలు చేశారా అని నిలదీశారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పదేళ్ల కాలంలో సర్పంచులను, పంచాయతీ రాజ్ శాఖను చెరబట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. సర్పంచ్‌లు చేసిన పనులకు నిధులు ఇవ్వకుండా, 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి వారిని అప్పుల పాలు చేసింది మీ బీఆర్ఎస్ పాలనలోనే కదా అన్నారు.

ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా సర్పంచులు రోడ్డున పడి బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకువచ్చారని, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక మహిళా సర్పంచులు తమ పుస్తెలను తాకట్టుపెట్టింది నిజం కాదా? ఇప్పుడు కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని సర్పంచ్‌ల తరపున మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పులు తెచ్చి వైకుంఠదామాలు నిర్మిస్తే నిధులు విడుదల చేయకుపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడిన సర్పంచులను అదే వైకుంఠ దామాల్లో పూడ్చిపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. మీరు చేసిన అరాచకాలతో రాబోయే 20 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలోకి రాబోయేది లేదన్నారు. ఇకనైనా స్థానిక సంస్థలకు, సర్పంచులకు చేసిన మోసానికి బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed