ఆర్మూర్‌లో కాంగ్రెస్‌దే హవా.. : వినయ్ రెడ్డి

by Rajesh |
ఆర్మూర్‌లో కాంగ్రెస్‌దే హవా.. : వినయ్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి ఉన్నందున కాంగ్రెస్ హవా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే మొదటి కార్యక్రమంగా జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జర్నలిస్టులకు మోసం చేసినట్లే నియోజవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లును ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వలేదన్నారు. యువతకు జీవనభృతి, కొత్త పింఛన్లు ఇవ్వలేదన్నారు.

జీవన్ రెడ్డి నియంత పోకడలను తరిమికొట్టాలని వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక నుంచి తప్పులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజవర్గంలో బీఆర్ఎస్ నాయకులు ఎక్కడెక్కడ భూకబ్జాలు చేశారో, ప్రైవేట్ వ్యక్తులకు ఇబ్బంది పెట్టారనే విషయాలను వెలికి తీస్తామన్నారు. కుల సంఘాలకు అసైన్మెంట్ భూమి ఇవ్వకుండా మున్సిపాలిటీ, జీపీల 10 శాతం భూమి ఇవ్వడం తప్పని చెప్పారు. ఈ స్థలాలలో ఉద్యానవనాలు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి ఒక్కరేనని పైడి రాకేష్ రెడ్డి చెప్పడం చిల్లర రాజకీయమన్నారు.

రాకేష్ రెడ్డి డ్రామాలు చేయడం మాను కోవాలని, తాను జీవన్ రెడ్డితో మీలాఖతైనట్లు చెప్పినందున సిద్దుల గుట్టపై ప్రమాణం చేయడానికి రావాలని సవాల్ చేశారు. ఏడు సంవత్సరాల నుంచి జీవన్ రెడ్డితో కలిసిన సందర్భం లేదని, తనకి ఎవరైనా శత్రువు ఉన్నాడంటే అది ఒక్క జీవన్ రెడ్డే అని ఆయన స్పష్టం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో 5 ఏళ్లు కలిసి ఉన్నానని వారందరూ తనకు అండగా ఉండడానికి కలిసి రావాలని కోరారు. ఓట్లు అడిగే హక్కు కేవలం తనకే ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇండ్ల వద్దకు వచ్చి తాయిలాలు ఇచ్చి మభ్యపెడితే ఓట్లు వేసి మోసపోవద్దని ఆయన అన్నారు.

ఎంపీ అరవింద్ విజయం సాధిస్తే నిజామాబాద్ నియోజకవర్గంలో లక్ష గృహాలు నిర్మిస్తామని అప్పటి హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు రామ్‌మాధవ్ ఆర్మూర్‌కు వచ్చి పసుపును క్వింటాలుకు పదివేలకు కొనుగోలు చేస్తామని చెప్పి మోసం చేశాడని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యుడు కోలా వెంకటేష్, పట్టణ బిసి శాఖ అధ్యక్షుడు దొండి రమణ, కాంగ్రెస్ నాయకులు ఖయ్యూం, జిమ్మీ రవి, భగత్ తదితరులు పాల్గొన్నారు.

సిటీ గార్డెన్‌లో కాంగ్రెస్ సన్నాహక సమావేశం

కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల సన్నహాక సమావేశాన్ని ఆర్మూర్ మున్సిపల్ లోని పెర్కిట్ గల సిటీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించారు. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొని కార్నర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మార చంద్రమోహన్, యాళ్ల సాయి రెడ్డి, గంగాధర్ గౌడ్, సాయిబాబా గౌడ్, కోల వెంకటేష్, చేపూర్ చిన్నారెడ్డి, భూమేష్, రవిప్రకాష్, విజయ్, మంద మహిపాల్, పెంట ఇంద్రుడు, పోషన్న, ప్రమోద్, అబీబ్, మహమ్మద్ అలీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed