Congress-AIMIM: సీఎంపై అసదుద్దీన్ పొగడ్తలు.. బలపడుతోన్న కాంగ్రెస్-ఎంఐఎం మైత్రి

by Shiva |
Congress-AIMIM: సీఎంపై అసదుద్దీన్ పొగడ్తలు.. బలపడుతోన్న కాంగ్రెస్-ఎంఐఎం మైత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్-ఎంఐఎం బంధం బలపడుతున్నదా..? సోమవారం ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లు కురిపించుకోవడాన్ని చూసిన వారంతా ఇదే చర్చించుకుంటున్నారు. రాజకీయంగా మరింత కలిసి అడుగులు వేయాలని ఇరు పార్టీలు అంతర్గతంగా ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ ప్రశంసలు కురిపించుకున్నారని టాక్. రాబోయే శాసనమండలి, జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఈ బంధం మరింత బలోపేతం కానున్నట్టు తెలుస్తున్నది. అంతర్గతంగా పరస్పరం కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. పాత బస్తీకి నిధుల విషయంలో, అభివృద్ధి విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు చెప్పిన వాటికి ముందు నుంచి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నది. పాతబస్తీని మరింత అభివృద్ధి చేసేందుకు ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు. సంక్రాంతి పండుగలోపే భేటీ కానున్నారు.

ఎంఐఎం స్ట్రాటజీ వేరు..

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీతోనే అంటకాగుతుందని ఎంఐఎం పార్టీపై విమర్శలు ఉన్నాయి. గతంలో టీడీపీతో ఆ తరువాత కాంగ్రెస్‌తో.. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలువడంతో ఆ పార్టీతోనూ దోస్తానా కట్టింది. 2004 నుంచి 2014 వరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మినహా మిగిలిన కాలమంతా కాంగ్రెస్‌తో సఖ్యతతోనే ఉన్నది. ఆ తరువాత బీఆర్ఎస్‌తో​పదేండ్ల పాటు ఫ్రెండ్‌షిప్ చేసింది. అనంతరం కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో ఇప్పుడు ఆ పార్టీకి దగ్గరైందన్న టాక్. అందుకే.. కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం పాజిటివ్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. మూసీ పునరుజ్జీవం, హైడ్రా విషయంలోనూ ఎంఐఎం ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించలేదు. ఎంఐఎం ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిసరాల నుంచే మూసీ అత్యధిక భాగం ప్రవహిస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వం నిర్ణయంపై ఎంఐఎం సైలెంటుగానే ఉండిపోయింది. అటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తున్నా సంయమనం పాటించింది.

ఫ్యూచర్ ప్లాన్..

శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎంఐఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇఫెండి పదవీ కాలం మార్చి 30తో ముగియనుంది. అదే సమయంలో మే1న హైదరాబాద్​జిల్లా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్​సభ్యుడు ఎమ్మెస్​ప్రభాకర్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ సీటును కాంగ్రెస్​పార్టీ ఎంఐఎంకు వదిలేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలోని స్థానాన్ని కాంగ్రెస్​పార్టీ తీసుకునే అవకాశం ఉన్నదని మరోవైపు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్​ఎన్నికలు రానున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఎంఐఎంకు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉన్నది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ మున్సిపల్​కార్పొరేషన్‌లు, ముథోల్,​ఆదిలాబాద్, తాండూరు, నల్గొండ లాంటి పట్టణాల్లో ఎంఐఎంకు మంచి పట్టు ఉన్నది. ఈ స్థానాల్లో చెప్పుకోదగిన సంఖ్యలో కార్పొరేటర్, కౌన్సిలర్లను గెలుచుకున్నారు. ఇక్కడ ఎంఐఎం మద్దతు ఇతర పార్టీలకు చాలా కీలకం. వీటితోపాటు హైదరాబాద్‌లో ఎంఐఎం పట్టు గురించి వేరే చెప్పనక్కర్లేదు. వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కాంగ్రెస్​గెలవాలంటే ఎంఐఎం మద్దతు చాలా వరకు అవసరం. ఈ నేపథ్యంలో ఎంఐఎం-కాంగ్రెస్​దోస్తీ కుదిరినట్లేనని అంచనా వేస్తున్నారు.

అసదుద్దీన్ కామెంట్స్

‘పాతబస్తీకి మెట్రో రైలు రావడం చాలా సంతోషం. ఇప్పటివరకు ఐదుగురు సీఎంలు వచ్చినా ఎవరూ చేయలేని పనిని రేవంత్‌రెడ్డి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో మెట్రో రైలు ప్రాజెక్టు వచ్చినా నిధులు కేటాయించలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మధ్యలో మరణించారు. తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదు. గత ప్రభుత్వాలు మెట్రోను పాతబస్తీ వరకు విస్తరించడానికి కనీసం ఇంట్రెస్ట్​చూపించలేదు. కానీ.. రేవంత్‌రెడ్డి మాత్రం పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. ఎంతో కాలంగా ఓల్డ్ సిటీ వాసులు ఎదురుచూస్తున్న మెట్రో రైలు ఇప్పుడు ఆచరణలోకి రావడం ప్రశంసనీయమం. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు’

Advertisement

Next Story

Most Viewed