గృహలక్ష్మి స్కీమ్‌‌పై కన్ఫ్యూజన్.. మంత్రి వేముల ప్రకటనతోనూ రాని క్లారిటీ!

by GSrikanth |   ( Updated:2023-08-09 08:33:37.0  )
గృహలక్ష్మి స్కీమ్‌‌పై కన్ఫ్యూజన్.. మంత్రి వేముల ప్రకటనతోనూ రాని క్లారిటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై గందరగోళం కంటిన్యూ అవుతూనే ఉన్నది. మండల స్థాయిలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మండల స్థాయిలో అధికారులు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే.. ఈ స్కీమ్‌కు సంబంధించిన అప్లికేషన్ నిబంధనలు ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుగా ఉండటంతో ప్రజలు కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. రేపటితో మొదటి విడత దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగియనుండగా.. నిబంధనలపై ప్రజల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోజు మంత్రి వేముల ప్రశాంత్ మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో దరఖాస్తుల గడువుపై ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది. పథకం నిరంతర ప్రక్రియ అన్న మంత్రి మొదటిదశ దరఖాస్తులకు గడువు ఈనెల పదవ తేదేనని పరోక్షంగా చెప్పారు. రెండు రోజుల్లో అడిగిన ధ్రువీకరణ పత్రాలు ఎలా తెస్తారన్న ప్రశ్నలకు జవాబివ్వలేదు. వేర్వేరు జిల్లాల్లో దరఖాస్తు నమూనాలు భిన్నంగా ఉండడంపై కూడా స్పష్టతనివ్వలేదు. పైగా ప్రతిపక్షాలపై, కొన్ని పత్రికలపై విమర్శలు గుప్పించారు.

జిల్లాకో రూల్.. జనాలకు సవాల్!

గృహలక్ష్మి స్కీమ్ విషయంలో అధికారులు ఒక్కో జిల్లాకు ఒక్కో రూల్ పాటిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఓ పథకం తీసుకువస్తే దరఖాస్తు నమూనా ఒకేలా ఉంటుంది. కానీ.. ఈ పథకం విషయంలో భిన్నంగా ఉంది. మహిళల పేరుతోనే మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. దరఖాస్తుదారుల ఇన్‌కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ నిబంధన పెట్టింది. సాధారణంగా గ్రామాల్లో మహిళల పేరుతో ఇన్‌కమ్ సర్టిఫికెట్లు తీయడం అరుదు. అలాంటిది మూడు రోజుల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఎక్కడి నుండి తీసుకువచ్చేది. వీటితోపాటు రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతోపాటు సొంత స్థలమే అని నిరూపించుకునేలా డాక్యుమెంట్లు కోరుతోంది. తక్కువ గడువు ఇచ్చి ఇన్ని కొర్రీలు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు.

గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ: వేముల

గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఖాళీ స్థలం ఉండి.. సొంత ఇల్లు కట్టు కోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందించే ఈ పథకం నిరంతర ప్రక్రియ అని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఇవాళ నోట్ రిలీజ్ చేశారు. గ్రామ కంఠంలోని పాత ఇళ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని.. ఇంటి నంబర్ లేకున్నా ఖాళీ స్థలం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొదటి దశలో నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు ఇస్తున్నామని.. ఇవి పూర్తయిన తర్వాత రెండో దశ కోసం దరఖాస్తులు తీసుకుంటామన్నారు.

మంత్రి వివరణలోనూ ఏది క్లారిటీ..?

గృహలక్ష్మి పథకం విషయంలో ప్రజలు అయోమయానికి గురవుతున్న తీరును ప్రతిపక్షాలు, దినపత్రికలు బయట పెట్టాయి. దీనిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చినా.. అందులోనూ పూర్తి స్పష్టత కనిపించలేదు. పత్రికల ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఇన్‌కమ్ సర్టిఫికెట్ విషయంలో, అప్లికేషన్ల గడువు విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వకుండా నిరంతర ప్రక్రియే అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. అప్లికేషన్లు మండల స్థాయిలోనే సమర్పించాలని అధికారులు సూచిస్తుంటే.. మంత్రి మాత్రం ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌కు పంపించవచ్చని చెప్పడంతో అసలు ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలనేది క్లారిటీ లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story