అంబర్‌పేట ఘటన తర్వాత.. వీధి కుక్కలపై 36 గంటల్లో 15 వేల ఫిర్యాదులు!

by Hamsa |
అంబర్‌పేట ఘటన తర్వాత.. వీధి కుక్కలపై 36 గంటల్లో 15 వేల ఫిర్యాదులు!
X

దిశ, సిటీ బ్యూరో : గ్రేటర్‌లో కుక్కల వీరంగంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. కుక్క కన్పిస్తే చాలు ఎక్కడ పిక్క పడుతుందోనని పిల్లలు, పెద్దలు భయంతో వణికిపోతున్నారు. నగర వాసులకు ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జీహెచ్ఎంసీ తరుచూ ప్రకటనలు చేస్తున్నది. కానీ, కుక్కల బెడదపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు త్వరగా పరిష్కారం చూపడంలేదు. అంబర్‌పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చనిపోయిన ఘటన తర్వాతనే జీహెచ్ఎంసీ మేలుకున్నది. టోల్ ఫ్రీ నంబర్ 040- 21111111 లేక ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌కు ఫిర్యాదులు చేయాలని ప్రకటించింది. అలా చెప్పిందో లేదో.. కేవలం 36 గంటల్లోనే బల్దియా హెడ్‌ ఆఫీస్‌లోని కమాండ్ కంట్రోల్ దాదాపు 15 వేల ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. అయితే అధికారులు మాత్రం ఫిర్యాదుల వివరాలు చెప్పడంలేదు. మొన్నటి వరకు కుక్కలకు సంబంధించి ప్రతిరోజూ కేవలం 20 నుంచి 30 ఫిర్యాదులే వచ్చేవి. అంబర్‌పేట ఘటన తర్వాత ఫిర్యాదుల సంఖ్య అమాంతం పెరిగింది. ఫిర్యాదుల్లో జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్, సంబంధిత విభాగం అధికారులకు రోజుకు కేవలం 300 నుంచి 350 దరఖాస్తులు మాత్రమే పరిష్కరిస్తున్నట్టు తెలిసింది.

రోజుకు పదే అటెండ్

సిటీలో కుక్కల బెడదపై వచ్చే ఫిర్యాదులను తొలుత కమాండ్ కంట్రోల్ స్వీకరిస్తుంది. వాటిని విభాగాలు, సర్కిళ్ల వారీగా పంపిస్తుంది. సర్కిల్ పరిధిలో వెటర్నరీ అధికారులు, స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బంది రోజుకు కేవలం పది ఫిర్యాదులకు మాత్రమే అటెండ్ అవుతున్నారు. ఇలా ఎందుకని ప్రశ్నిస్తే మ్యాన్ పవర్, మెషినరీ కొరత ఉందని సమాధానమిస్తున్నారు. అంబర్ పేట ఘటనకు ముందు వెటర్నరీ విభాగంలోని పర్మినెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్టు కార్మికులు ఎక్కడుంటారో? ఎక్కడ పని చేస్తుంటారో అంతుచిక్కకుండా ఉండేది. ఉన్నతాధికారులు కొత్తగా కట్టుకునే విల్లాల పనుల్లో, వారి కుటుంబ పనులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు స్టాఫ్ ఎక్కడా? అని ప్రశ్నిస్తే మొత్తం ఫీల్డ్‌లోనే ఉన్నారని అధికారులు సమాధానమిస్తున్నారు. ఇందులో నిజమెంతో వారికే తెలియాలి.

స్పీడ్ కాని స్టెరిలైజేషన్

కుక్కలను పట్టుకొచ్చేందుకు అధికారులు చూపే శ్రద్ధను వాటికి స్టెరిలైజేషన్, ఆపరేషన్లు, వ్యాక్సినేషన్ చేయడంపై లేదు. అంబర్‌పేట ఘటనకు ముందు ప్రతిరోజూ 200 కుక్కలకు స్టెరిలైజేషన్, ఆపరేషన్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ చెప్పింది. వాటి ఆపరేషన్లకు 5 యానిమల్ కేర్ హోమ్‌లు ఉండగా.. ఇపుడు డైలీ150 ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నట్టు సమాచారం.

అబ్జర్వేషన్‌లో దాడికి పాల్పడ్డ కుక్కలు

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన బాలుడు ప్రదీప్ తల్లిదండ్రులను బల్దియా అధికారులు హైదరాబాద్‌కు రప్పించారు. చిన్నారి మృతిపై హైకోర్టు సుమోటోగా విచారణ స్వీకరించడంతో తల్లిదండ్రులను రప్పించి, వివరాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా చిన్నారిపై దాడి చేసిన కుక్కలను సంజీవయ్య పార్కులో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అబ్జర్వేషన్‌లో ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed