అబిడ్స్ చౌరస్తాకు రా.. ఎమ్మెల్యే ఈటల సంచలన సవాల్

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-07 17:33:20.0  )
అబిడ్స్ చౌరస్తాకు రా.. ఎమ్మెల్యే ఈటల సంచలన సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని తేలితే ముక్కు నేలకు రాసి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ చేశారు. దానిపై చర్చించేందుకు అసెంబ్లీ ఎదురుగా అయినా, సచివాలయం ఎదురుగా అయినా, ఆబిడ్స్ చౌరస్తా అయినా చర్చకు ఒకేనని ఈటల సవాల్ చేశారు. ఒకవేళ చర్చకు రాకపోతే 24 గంటలు కరెంట్ ఇస్తున్నామనే తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో మంత్రులకు ఎవరికీ స్వేచ్ఛ లేదని, ఉన్నా మంత్రులకు అవగాహన లేదని ఆయన చురకలంటించారు. ఇకపోతే కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ అడ్మిషన్లలో మెరిట్ పాటించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.

వైస్ చాన్స్‌లర్ రమేష్ వచ్చినప్పటి నుంచి ఏ సమస్య లేవనెత్తిన పరిష్కరించడం లేదని విమర్శలు చేశారు. వీసీ రమేష్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో విశ్వవిద్యాలయాల్లో ఏ సమస్య వచ్చినా పరస్పర అవగాహనతో ముందుకు వెళ్ళేవారని, కానీ ఇప్పుడా వాతావరణం లేదన్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ ఒకేసారి చేస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని, కానీ ఆయన చేసిన సాయం కన్నా ద్రోహం వల్ల రైతులు అప్పులపాలయ్యారని విమర్శలు చేశారు.

డబ్బులు రాబట్టుకోవడానికి మద్యం టెండర్ల ధరలు పెంచారని ఫైరయ్యారు. కేసీఆర్ ఇప్పటికైనా హోం గార్డుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు రాబోతున్న కారణంగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందని ఈటల పేర్కొన్నారు. ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు.

Advertisement

Next Story