CM Revanth: తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-13 14:37:51.0  )
CM Revanth: తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వరద నష్ట పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి తక్షణమే ఆర్థికసాయం అందించాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు నిధుల వినియోగంలో కఠినమైన నిబంధనలు సడలించాలని కోరారు. ప్రస్తుత నిబంధనలతో రూపాయి కూడా వినియోగించుకోలేకపోతున్నామని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతింటే మరమ్మతులకు కేవలం రూ.లక్ష రేటు నిర్ణయించారు. రూ.లక్షతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని అన్నారు.

ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని అన్నారు. ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలు పరిశీలించి విపత్తు సాయం అందించాలని కోరారు. మున్నేరు వరద ముప్పు నివారణకు రిటైనింగ్‌ వాలే శాశ్వత పరిష్కారం అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినంత నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా తెలంగాణ వరద నష్టం రూ.10,320 కోట్లు జరిగిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా, గత రెండు వారాల క్రితం సంబవించిన వరదల కారణంగా రాష్ట్రంలో ఖమ్మం ప్రాంతం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. వందలాది నిరాశ్రయులు అయ్యారు.

Advertisement

Next Story