జేపీ నడ్డాతో CM రేవంత్ భేటీ.. NHM నిధులపై కేంద్రమంత్రికి కీలక విజ్ఞప్తి

by Satheesh |
జేపీ నడ్డాతో CM రేవంత్ భేటీ.. NHM నిధులపై కేంద్రమంత్రికి కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణ‌కు రావాల్సిన బ‌కాయిలు రూ.693.13 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగ‌ళ‌వారం ఆయ‌న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను కేంద్ర మంత్రికి వివ‌రించారు.

ఆయుష్మాన్ భార‌త్ నిబంధ‌న‌లన్నింటిని తాము ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి న‌డ్డాకు తెలియ‌జేశారు. ప‌ట్టణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకుగానూ 5,159 బ‌స్తీ ద‌వాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) స‌మ‌ర్థంగా నిర్వహిస్తున్నామ‌ని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మెరుగైన వైద్య సేవ‌ల‌కుగానూ..

రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్ర ప్రభుత్వం స‌హ‌క‌రించాల‌ని, ఎన్‌హెచ్ఎం బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రి న‌డ్డాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎన్‌హెచ్ఎం 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, 2024-25 మొద‌టి త్రైమాసిక గ్రాంట్ రూ.138 కోట్లు మంజురు చేయాల్సి ఉంద‌ని, ఆ మొత్తాన్ని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

ఎన్‌హెచ్ఎం కింద చేప‌ట్టిన మౌలిక వ‌స‌తులు, నిర్వహ‌ణ కాంపోనెంట్ కింద 2023-2024 సంవ‌త్సరానికి సంబంధించి రావ‌ల్సిన రూ.231.40 కోట్లు త‌క్షణ‌మే రీయింబ‌ర్స్ చేయాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎన్‌హెచ్ ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆల‌స్యం కావ‌డంతో అత్యవ‌స‌ర వైద్య సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా, సిబ్బందికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన వాటా మొత్తాన్ని 2023, అక్టోబ‌రు నుంచి తామే విడుద‌ల చేస్తున్నామ‌ని కేంద్ర మంత్రి న‌డ్డా దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

Advertisement

Next Story