నామినేటేడ్ పోస్టులకు హై కమాండ్ గ్రీన్ సిగ్నల్.. నాలుగైదు రోజుల్లోనే ఉత్తర్వులు..!

by Satheesh |
నామినేటేడ్ పోస్టులకు హై కమాండ్ గ్రీన్ సిగ్నల్.. నాలుగైదు రోజుల్లోనే ఉత్తర్వులు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అగ్రనేత సోనియాగాంధీతో చర్చించారు. వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఆమెను నివాసంలో కలుసుకున్న సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణపై తన అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలిసింది. ఎలాగూ నాలుగైదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ల మార్పు కూడా ఉన్నందున ఇప్పుడే తొందరేమీ లేదని ఆమె సూచించినట్లు సమాచారం. కేబినెట్ విస్తరణ విషయంలో కాస్త టైమ్ తీసుకుంటామని సూచించినట్లు తెలిసింది. ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో గో ఎహెడ్ అంటూ సంకేతమిచ్చినట్లు సమాచారం. ఈ నెల 12వ తేదీలోగా ఈ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశమున్నది.

సోనియాగాంధీతో దాదాపు ముప్పావుగంట సేపు భేటీ అయిన సీఎం రేవంత్.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎనిమిది సీట్లు గెల్చుకోవడం తదితర అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం, పలు నియోజకవర్గాల్లో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు చేయడం, ఫలితంగా బీజేపీ గెలిచిన ఎనిమిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడ దక్కకపోవడం.. ఇలాంటి అంశాలన్నింటినీ సోనియాగాంధీకి వివరించినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఓడిపోయినా కేవలం నాలుగున్నర వేల ఓట్ల తేడా మాత్రమే ఉందని కూడా చెప్పినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు దానిక తగినట్లుగానే ఎనిమిది లోక్‌సభ సెగ్మెంట్లలో గెలిచామని కొన్ని గణాంకాలను వివరించినట్లు తెలిసింది.

సోనియాగాంధీతో భేటీ సందర్భంగా రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతోనే సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఎన్నికల హడావిడి ముగిసినందున ఇకపై పరిపాలనలో అవలంబించనున్న విధానాలు, తీసుకోనున్న నిర్ణయాలు తదితరాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పీసీసీ చీఫ్‌గా పలువురు పోటీ పడుతున్నందున పార్టీ బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఇస్తే బాగుంటుందనే అంశం చర్చకు వచ్చినా కొన్ని రోజుల తర్వాత దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని ఆ ముగ్గురు నేతల నుంచి సమాధానం వచ్చినట్లు తెలిసింది. దీంతో అటు పీసీసీ చీఫ్ నియామకం, ఇటు కేబినెట్ విస్తరణపై మరోసారి ఢిల్లీలో చర్చలు జరిగిన అనంతరం నిర్ణయం వెలువడే అవకాశమున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నిక, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా బాధ్యతలు ఎవరికివ్వాలి తదితర అంశాలు ప్రధానం కావడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీరియస్ చర్చ, నిర్ణయాలు జరగలేదని తెలిసింది.

Advertisement

Next Story