వాటి జోలికి వెళ్లకండి.. టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక?

by GSrikanth |   ( Updated:2022-08-24 09:57:00.0  )
వాటి జోలికి వెళ్లకండి.. టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూడోసారి అధికార పీఠంపై కూర్చోవాలని టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది. రెండు దఫాలుగా ప్రతిపక్షాలతో పెద్దగా పోటీ లేని గులాబీ పార్టీకి రాబోయే ఎన్నికలు కత్తిమీద సాము అన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ యాక్టివిటీస్ పెరిగిపోవడం అధికార పార్టీని అయోమయానికి గురి చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీ స్కామ్ టీఆర్ఎస్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ అంశంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గులాబీ బాస్ అలర్ట్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీజేపీ ట్రాప్ లో పడొద్దు:

సీబీఐ, ఈడీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుగ్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన పార్టీ నేతలతో చర్చించారని ఇందులో పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల నుండి సమాచారం. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారని ఈ సందర్భంగా బీజేపీ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టిని ఆకర్షించే ఎలాంటి అక్రమాలు, డీలింగ్‌లకు పాల్పడవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్‌ నేతలను హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే దేశంలో లేదా విదేశాల్లో ఇతరులకు సంబంధించిన ఆర్థిక లేదా ఇతర వ్యవహారాలపై ఎలాంటి సమావేశాలకు హాజరుకావద్దని నేతలు సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది.

బీజేపీ ఎత్తుగడలకు చెక్ పెట్టాలి:

కేంద్రంలోని బీజేపీ సర్కార్ టీఆర్ఎస్ నేతల విషయంలో అదును కోసం ఎదురు చూస్తున్న సంగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులను కేసుల్లో ఇరికించే ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తున్నందున వారిని కూడా ఆయన హెచ్చరించారట. హైదరాబాద్ ఇప్పటికే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని సైతం సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బండి సంజయ్, రాజాసింగ్ ల అరెస్ట్ ఎపిసోడ్ పై సీఎం చర్చించారని.. మతం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల పేరుతో రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై సీఎం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, దర్యాప్తు సంస్థల విషయంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు అలర్ట్ చేశారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు ఇతర ఆరోపణలపై కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

8 ఏండ్లలో ఏం చేశావ్..? కేసీఆర్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్

Advertisement

Next Story