మునుగోడు సభలో KCR నో క్లారిటీ.. TRS శ్రేణుల్లో నిరాశ

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-20 13:24:12.0  )
మునుగోడు సభలో KCR నో క్లారిటీ.. TRS శ్రేణుల్లో నిరాశ
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు సభలో సీఎం కేసీఆర్ బీజేపీ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఈ సభ వేదికగా గులాబీ బాస్ ఓ విషయంలో స్పష్టత ఇస్తారని అంతా భావించినా.. ఆ ఊసే ఎత్తకపోవడం అందరిని తీవ్ర నిరుత్సాహ పరిచింది. మునుగోడు ఉప ఎన్నిక కోసం పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. కానీ అభ్యర్థిని ప్రకటించకుండానే కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించేయడం ఆశ్చర్యపరిచింది. మునుగోడులో కేసీఆర్ ప్రసంగాన్ని గమనిస్తే.. కేవలం తన కటౌట్ చూసే ఓటు వేయాలనే దిశగా ప్రసంగం సాగిందనే టాక్ వినిపించింది. బీజేపీ బూచిగా చూపెట్టిన కేసీఆర్.. మునుగోడు నియోజకవర్గానికి తాను ఏం చేశానో అనేది స్పష్టంగా వివరించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతున్న పథకాలే తప్ప.. ప్రత్యేకంగా మునుగోడుకు ఏం చేశాం.. ఏం చేయబోతున్నామనే సంగతి పూర్తిగా విస్మరించారనే నిరుత్సాహం సర్వత్రా నెలకొంది. మీ అందరి పక్షాన తాను బీజేపీతో అలుపెరుగని పోరాటం సాగిస్తున్నానని చెప్పుకొచ్చిన కేసీఆర్.. మునుగోడులో టీఆర్ఎస్ ను కాదని బీజేపీని గెలిపిస్తే పరిస్థితులు దారుణంగా తయారవుతాయని చెప్పారు. చండూరులో మరో సభ ఉంటుందని.. మునుగోడు ఉప ఎన్నిక కాదని, మన బతుకు ఎన్నిక అని సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేశారు.

బీజేపీ టార్గెట్ గా విమర్శలు

మునుగోడు టీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ గా చెలరేగారు. మోడీ, అమిత్ షాలకు ప్రశ్నల వర్షం కురిపించారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రేపు మునుగుడుకు రావాలని అమిత్ షా కు డిమాండ్ చేశారు. మోడీ హయాంలో ఏ వర్గానికి మేలు జరిగిందో చెప్పాలన్నారు. బీజేపీపై ఒంటి కాలితో లేచిన కేసీఆర్..మునుగోడులోని డిండి ప్రాజెక్టు నిర్వాసితుల దీక్ష, ఇతర సమస్యలపై సరైన రీతిలో స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు పట్టు ఉండటంతో పదే పదే వారి ప్రస్తావన తీసుకువచ్చి వారి ఓట్ బ్యాంక్ మిస్ కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతం కంటే భిన్నంగా ఈసారి కేసీఆర్ మీటింగ్ సాగిందని.. తొలి సభనే ఎన్నికల ప్రచార సభగా మార్చేశారని, తమ ప్రత్యర్థి ఎవరో ఈ సభ ద్వారా కేసీఆర్ చెప్పకనే చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది.

అభ్యర్థి పేరు ప్రకటించకుండానే మునిగిసిన సభ

రాబోయే మునుగోడు ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ అభ్యర్థిని ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ కారు పార్టీలో నేతల మధ్య కలహాలు అధిష్టానానికి తలనొప్పి వ్యవహారంగా మారిపోయినట్లుగా తెలుస్తోంది. మునుగోడు టీఆర్ఎస్ లో ప్రధానంగా ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతుండగా.. కేసీఆర్ మాత్రం టికెట్ అంశాన్ని ప్రస్తావించకుండా, కేవలం బీజేపీపై దాడికి దిగడం అందరిని ఆశ్చర్యపరిచింది. అభ్యర్థిని ప్రకటిస్తే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉండేదని అంతా భావించినప్పటికీ.. ఆశావాహులు ఎక్కువ మంది ఉండటం.. స్థానిక నేతల్లో సయోధ్య లేకపోవడం టీఆర్ఎస్ ను తిప్పలు పెడుతోందనే మాట వినిపిస్తోంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు స్వయంగా కేసీఆర్ సర్ది చెప్పి చూసినా.. అసమ్మతి నేతలు వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. అందువల్లే ఉపఎన్నికకు ఇంకా చాలా టైమ్ ఉండటంతో ఈ విషయంలో తొందరపడొద్దనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలోని అసంతృప్తులకు గాలం వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ సిద్దంగా ఉన్న తరుణంలో అభ్యర్థి విషయంలో పొరపాటు జరిగితే పార్టీకి పెద్ద డ్యామేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ అంశంలో నిర్ణయానికి ఇంకాస్త సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ మునుగోడు సభలో ఊహించని పరిణామం...TRS Praja Deevena Sabha

Advertisement

Next Story

Most Viewed