మోడీ మీటింగ్‌కు మరోసారి KCR దూరం?

by samatah |   ( Updated:2022-12-05 09:23:02.0  )
మోడీ మీటింగ్‌కు మరోసారి KCR దూరం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దూరంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ 20 సమ్మిట్ పై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరగబోయే ఈ సమావేశానికి హాజరుకావాలని దేశంలోని పార్టీలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. కేంద్రం ఆహ్వానం మేరకు ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నుంచి సీఎం జగన్, చంద్రబాబలు హాజరుకాబోతున్నారు. మరో వైపు ఈ సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కాగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ నుంచి ఈ సమావేశానికి ఎవరు హాజరు అవుతారనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.

జీ20 కూటమికి ఈ ఏడాది అధ్యక్ష హోదా పగ్గాలు భారత్ చేపట్టింది. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మోడీ రాజకీయ పార్టీల అధ్యక్షుల అభిప్రాయాలను ఈ సమావేశం ద్వారా చర్చించి తెలుసుకోనున్నారు. మోడీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ మీటింగ్ ను టీఆర్ఎస్ పార్టీ స్కిప్ చేస్తుందా లేక చివరి నిమిషంలో ఎవరినైనా పార్టీ ప్రతినిధిని పంపుతుందా అనే సందేహాలు ఉత్కంఠగా మారాయి. అయితే మోడీ అధ్యక్షత ఈ మీటింగ్ జరగబోతున్న నేపథ్యంలో మోడీకి ఎదురు పడటం ఇష్టం లేకే సీఎం కేసీఆర్ ఈ మీటింగ్ కు దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. గత నెలలో తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ తెలంగాణ ప్రభుత్వంపై ఇన్ డైరెక్ట్ గా విరుచుకుపడ్డారు. ప్రధానిపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మోడీ తెలంగాణకు వస్తే ప్రోటోకాల్ ప్రకారం ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం ఎయిర్ పోర్టుకు వెళ్లడం లేదు. దీనిపై రాజకీయంగా రగడ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీ20 లక్షాలపై చర్చించేందుకు కేంద్రం నిర్వహిస్తున్న సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండబోతున్నారనే టాక్ రాజకీయంగా హాట్ టాపిక్ అయింది.

Also Read: 'టచ్‌లో ఉన్నారు'.. టీఆర్‌ఎస్‌పై బీజేపీ కొత్త స్కెచ్!

Advertisement

Next Story