- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిటీ టు స్టేట్
దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు హైదరాబాద్ సిటీకి మాత్రమే పరిమితమైన బీజేపీ కార్యకలాపాలు ఇటీవలి కాలంలో ప్రతి జిల్లాలోకి చొచ్చుకెళ్లాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి కిషన్‌రెడ్డి స్టేట్ బీజేపీ చీఫ్. ఆ తర్వాత లక్ష్మణ్ మూడేండ్ల పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. బండి సంజయ్ 2020 మార్చిలో పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీకి కొంత ఊపు వచ్చింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించడం ఆ పార్టీకి రాష్ట్రంలో టర్నింగ్ పాయింట్‌గా మారింది. దానికి కొనసాగింపుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించడం, మునుగోడులో స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం.. ఇవన్నీ ఆ పార్టీకి ప్రజల్లో పెరిగిన ఆదరణను తెలియజేస్తున్నాయి.
అన్ని జిల్లాలకు పార్టీ విస్తరణ
బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలను చేపట్టిన తర్వాతనే బీజేపీ హైదరాబాద్ సిటీ దాటి జిల్లాల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లిందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలే గర్వంగా చెప్పుకుంటుంటారు. జీహెచ్ఎంసీలో సైతం కేవలం నలుగురు కార్పొరేటర్లు ఉండే స్థాయి నుంచి 47 వరకు గెల్చుకున్నదని, బీఆర్ఎస్‌కు దీటుగా నిలిచిందనేది ఆ పార్టీ నేతల భావన. మునుగోడు ఉప ఎన్నికలో సుమారు 12 వేల ఓట్లతో ఓడిపోయినా ఆ నియోజకవర్గంలో కనీస స్థాయి నుంచి 90 వేల ఓట్ల స్థాయికి ఎదిగిందని, ఇదంతా బండి సంజయ్ స్టేట్ చీఫ్ అయిన తర్వాతనే జరిగిందని కార్యకర్తలు బహిరంగంగానే చెప్తుంటారు. మూడేండ్ల వ్యవధిలో పార్టీ యాక్టివిటీస్ అన్ని జిల్లాలకు విస్తరించ గలిగిందన్న ధీమాను వ్యక్తం చేశారు.
కేడర్‌లో జోష్
సమైక్య రాష్ట్రంలో వరంగల్, మహబూబ్‌నగర్ లాంటి కొన్ని లోక్‌సభ స్థానాల్లో పార్టీ గెలిచింది. నిజామాబాద్ లాంటి అసెంబ్లీ సెగ్మెంట్లనూ గెల్చుకున్నది. కానీ బండి సంజయ్ స్టేట్ చీఫ్ అయిన తర్వాత కేడర్‌లో మాత్రమే కాక ప్రజల్లోనూ జోష్ వచ్చిందనే భావనతో ఉన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని గ్రామాల్లోకి పార్టీ చొచ్చుకుపోయింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ తదితరులంతా తరచూ చేసే రివ్యూల్లో బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుపై చర్చించి సంతృప్తి వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో హవా
తెలంగాణ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ లాంటి సీనియర్ నేతలు ఓడిపోయారు. కానీ ఆరు నెలల వ్యవధిలోనే లోక్‌సభ్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొందింది. బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత బీఆర్ఎస్‌ను ఢీకొట్టగలిగే శక్తి బీజేపీకి మాత్రమే అనే జనరల్ టాక్ రాష్ట్రమంతా వినిపించింది. ప్రధాని మోడీ, అమిత్ షా వేర్వేరు సందర్భాల్లో ‘బండి సంజయ్ ఒక్కడుంటే చాలు.. పార్టీ జాతీయ నేతలు తెలంగాణకు రావాల్సిన అవసరమే లేదు.. బీఆర్ఎస్‌ను ఢీకొట్టడానికి మాతోని పనే లేదు..’ అంటూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తి రాష్ట్రంలో పార్టీ బాగా డెవలప్ అయిందనే మెసేజ్‌ను శ్రేణుల్లోకి, ప్రజల్లోకి పంపారు. రాష్ట్రంలో పార్టీకి ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ కార్యవర్గ సమావేశాలకు సిటీని వేదికగా చేసుకున్నారు.
బీఆర్ఎస్‌తో ఫైట్
కేసీఆర్ ఫ్యామిలీని డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ జైలుకెళ్ళడం పక్కా... ట్విట్టర్ టిల్లు.. లిక్కర్ క్వీన్.. లాంటి పంచ్ డైలాగులతో యూత్‌ను ఆకర్షించారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ దాదాపు ఏడాదిన్నర కాలం కరోనా సమయంలోనే గడిచిపోయిందని, 18 నెలల వ్యవధిలో ప్రజాసంగ్రామ యాత్రతో పాటు 18 భారీ బహిరంగసభలను నిర్వహించానంటూ బండి సంజయ్ ఒక సందర్భంలో తన కృషి గురించి మీడియాతో చెప్పుకున్నారు. జన సమీకరణలో, సభలను సక్సెస్ చేయడంలో తృప్తి లభించిందని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ యాక్టివిటీస్ డీలా పడ్డాయి. ఇటీవల రాష్ట్ర నేతలు వర్గాలుగా విడిపోయి ఎడమొహం పెడమొహంలా వ్యవహరించడం చివరకు ఆయనకు ఉద్వాసన పలికే స్థాయికి చేరుకున్నది.
మార్పు ఫలించేనా?
కేసీఆర్‌పైనా, ప్రభుత్వ వైఫల్యాలపైనా రాష్ట్ర యూనిట్ కొట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం స్టేట్ స్కీమ్‌ల మీద ప్రశంసలు కురిపిస్తూ బీఆర్ఎస్ సర్కార్‌ను మెచ్చుకోవడం బండి సంజయ్ సహా రాష్ట్ర నేతలను చిక్కుల్లో పడేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు స్ప్రెడ్ అయిన పరిస్థితుల్లో బండి సంజయ్ నుంచి బాధ్యతలను కిషన్‌రెడ్డికి అప్పగించడంతో ఇకపైన శ్రేణుల్లో జోష్ ఎలా నింపుతారు, అసెంబ్లీ ఎన్నికలకు కేడర్‌ను ఎలా సిద్ధం చేస్తారన్న సందేహం పార్టీ దిగువ స్థాయి లీడర్లలో వ్యక్తమవుతున్నది. మూడేళ్ల వ్యవధిలోనే అధికార పార్టీని సవాలు చేసే స్థాయికి చేరుకున్న బీజేపీ కార్యకలాపాలు ఇకపైన ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.