షాద్ నగర్ దళిత మహిళ ఘటనపై సీఎం స్పందించాలి: బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాం శేఖర్

by M.Rajitha |
షాద్ నగర్ దళిత మహిళ ఘటనపై సీఎం స్పందించాలి: బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాం శేఖర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : షాద్ నగర్ లో దళిత మహిళను అర్థరాత్రి పోలీస్ స్టేషన్ కి పిలిచి, 13 ఏళ్ల కుమారుడి ఎదుట ఆమెను వివస్త్రను చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాం శేఖర్ తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని, లేదంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాం శేఖర్ హెచ్చరించారు. సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల పరిస్థితులు మారలేదని, కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏం లేదని ఆయన దుయ్యబట్టారు. షాద్ నగర్ ఘటనపై శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో బీఎస్పీ పెద్ద ఎత్తున నిరసన నిర్వహించింది. ఈ సందర్భంగా ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలు దీనిని ప్రజా పాలన అనుకోవాలా? లేదంటే దొరల పాలనను మించిన రెడ్డి పాలన అనుకోవాలా? అని విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనను దొరల పాలన అని పిలిచారని, మరి ఈ పాలనను ఏమని పిలవాలని ఆయన మండిపడ్డారు. రేవంత్ కు ఆయన కులంపై ప్రేమ లేకపోతే, సీఐ రాంరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి, జైలుకు పంపాలని ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనిపై మౌనంగా ఉండటంపై మండిపడ్డారు. ఒక రెడ్డి మహిళలపై ఎస్సీ సీఐ కానీ, బీసీ సీఐ, ఎస్టీ సీఐ, మైనారిటీ సీఐ అయినా ఇలాగే చేసి ఉంటే రేవంత్ ఊరుకునేవారా? దీనికి సీఎం సమాధానం చెప్పాలన్నారు. ఆయన జవాబు చెప్పకపోతే.. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి బీఎస్పీ జవాబు చెప్పి తీరుతుందని హెచ్చరించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జరగాల్సింది హక్కుల పోరాటం కాదని, రాజ్యాధికార పోరాటమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా కులోన్మాదం తగ్గలేదన్నారు. హక్కుల పోరాటాలు వదిలి, రాజ్యాధికార పోరాటం పట్టకపోతే రాబోయే రోజుల్లో అందరి ఇంట్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఇబ్రాం శేఖర్ తెలిపారు.

Next Story